హబ్సిగూడలో నీట మునిగిన ప్రాంతాలను పడవలో వెళ్లి సమీక్షిస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్
భాగ్యనగరం కుంభవృష్టితో మళ్లీ నిలువునా వణికిపోయింది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన కుండపోత వర్షం నగరజీవికి చుక్కలు చూపింది. రోడ్డెక్కినవారికి ప్రత్యక్ష నరకం కనిపించింది. ప్రధాన రహదారులన్నీ చెరువుల్లా మారిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి వ రకు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం అయింది. 4 నుంచి 5 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఓవైపు వర్షం మరోవైపు ట్రాఫిక్ పద్మవ్యూహం మధ్య చిక్కుకొని వాహనదారులు రెండు మూడు గంటలపాటు నడిరోడ్డుపైనే అష్టకష్టాలు పడ్డారు. అనేకచోట్ల నాలాలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మంగళవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
గత ఎనిమిది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో నగరంలో ఇప్పటికే అనేక కాలనీలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. నాలాల్లో నీరు పోయే పరిస్థితి లేక పలు రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. చెరువులు, వాటిని ఆనుకొని వెలసిన దాదాపు 40 కాలనీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆదివారం కురిసిన వర్షానికి నడుము లోతు నీళ్లు చేరడంతో హబ్సిగూడ సాయిచిత్రనగర్‌లో అధికారులు పడవల ద్వారా వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఎంత తర్జనభర్జన జరిపినా సమస్యకు పరిష్కారం కన ుక్కోలేకపోయారు. మరో రెండు మూడ్రోజుల దాకా ఏమీ చేయలేమని తేల్చారు. ఇలాంటివి నగరంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. చెరువుల పరిసరాల్లోని అన్ని ప్రాంతాల్లో ఇదే దుస్థితి నెలకొంది. మరోవైపు ఆదివారం కురిసిన వర్షానికి ఇద్దరు మృతి చెందారు.
ఎందుకీ పరిస్థితి?
దాదాపు రెండు దశాబ్దాల కిందట నగరంలోని పలు చెరువుల ప్రాంతాలు ప్లాట్లుగా మారాయి. వాటికి అటు రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. లే ఔట్‌లకు హుడా, నిర్మాణాలకు ఎంసీహెచ్‌లు అనుమతులిచ్చాయి. లాభాలార్జించేందుకు రియల్టర్లు, ఆమ్యామ్యాలకు అలవాటు పడి అధికారులు, రాజకీయ నాయకులు.. ఇలా ఎవరి మేరకు వారు చెరువుల్ని పూడ్చి వాటిల్లో భవంతులు వెలిసేలా చేశారు. దీంతో సహజ సిద్ధంగా ఉన్న చెరువులు కనుమరుగవడం తోపాటు నాలాలను సైతం అడ్డగోలుగా దారి మళ్లించారు. నగరంలో 530 చెరువులకుగాను ప్రస్తుతం 169 మాత్రమే వి ుగిలాయి. ఈ మిగిలిన చెరువులు, వాటి ఎఫ్‌టీఎల్ ప్రదేశాల్లోనూ విస్తృతంగా నిర్మాణాలు జరిగాయి. వీటన్నింటి దుష్ఫలితాలే ఇప్పుడు నగరాన్ని పట్టి పీడిస్తున్నాయి.
శాశ్వత పరిష్కారం ఏదీ?
నగరంలో మిగిలిన కొద్దిపాటి చెరువుల్లో పూడిక తొలగిస్తే కొంతమేర ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. కిర్లోస్కర్, ఓయెం ట్స్ సొల్యూషన్స్ నివేదికలు అమలు చేస్తే వరద సమస్యలు పరిష్కారమవుతాయని తెలిసినా.. ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. నాలాల్లో నీరు వెళ్లే మార్గం లేక రోడ్లు చెరువులవుతున్నాయి. పంజగుట్ట, బయోడైవర్సిటీ, చాదర్‌ఘాట్, ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తదితర ప్రధాన రహదారుల్లోనూ ఏళ్ల తరబడి ఇదే దుస్థితి నెలకొంది. ప్రాధాన్యత క్రమంలో రూ.230 కోట్లతో 47 ప్రాం తాల్లో పనులకు టెండర్లు పిలిచినా.. ఇంకా భూసేకరణ జరగాల్సి ఉంది. ఇళ్లు మునిగినప్పుడు, రోడ్లు జలమయమైనప్పుడు ఆందోళనలు చేస్తున్న జనం.. వర్షం వెలియగానే భూసేకరణకు ససేమిరా అంటున్నారు. రాజకీయ నేతలు కూడా ఆ పనులు జరగకుండా ఉండేందుకే యత్నిస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ ప్రయోజనాలనే చూసుకోవడంతో ఏళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేవు.
వరదలకు ఇద్దరి మృతి
వరదలకు పాతబస్తీలో రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి గల్లంతైన ఇద్దరు.. సోమవారం విగత జీవులుగా తేలారు. ఇందులో చాంద్రాయణగుట్ట అల్ జుబేల్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ వహీద్ ఖాన్ (60) నాలాలో కొట్టుకుపోయి మృత్యువాత పడగా.. ఇదే కాలనీకి చెందిన మహ్మద్ అల్తాఫ్ (9) రైల్వే అ«ధికారులు తవ్విన గోతిలో పడి వ ుృతి చెందాడు. వహీద్‌కు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.
నల్లవాగు నాలా నుంచి మృతదేహాన్ని బయటికి తీసుకొస్తున్న పోలీసులు
నిండుకుండలా హుస్సేన్‌సాగర్..
వరుస వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా సోమవారం 513.33 మీటర్లుగా ఉంది.
నేడూ భారీ వర్షం!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రామచంద్రాపురంలో గరిష్టంగా 8.5 సెం.మీ. వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మాదాపూర్‌లో రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య 6.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వచ్చే 24 గంటలల్లో చందాన గర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్‌ల్లో కుంభవృష్టి కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్‌లో 5 అడుగులు, ఉస్మాన్‌సాగర్‌లో 3 అడుగుల మేర నీటి మట్టాలు పెరిగినట్లు జలమండలి అధికారులు తెలిపారు.
వర్షపాతం వివరాలు (సెం.మీ.లలో)
రామచంద్రాపురం: 8.5
మాదాపూర్: 6.7
పాశమైలారం: 5.4
తిరుమలగిరి: 4.7
మల్కాజ్‌గిరి: 4.1
రాజేంద్రనగర్: 3.9
గోల్కొండ: 3.7
బేగంపేట్: 3.6
జూబ్లీహిల్స్: 3.5
వెస్ట్ మారేడుపల్లి: 2.6
మైత్రీవనం: 2
మోండా మార్కెట్: 1.5
ముషీరాబాద్: 1.3
అంబర్‌పేట్: 1.2
కాప్రా: 1.2
బొల్లారం: 1.2
మౌలాలి: 1.1
Comments
Please login to add a commentAdd a comment