
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వర్షాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర రోడ్ల మీద ట్రాఫిక్ నిలిచిపోవడంతో వానలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూకట్‌పల్లి, అమీర్‌పేట, కొండాపూర్‌లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మియాపూర్, బీహెచ్‌ఈఎల్, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, పంజాగుట్ట వర్షం భారీ కురుస్తోంది. ఉప్పల్, మెహిదీపట్నం, కార్వాన్, టోలిచౌక్, అంబర్ పేట, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌లో ఏకంగా 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ట్రాఫిక్ కష్టాలు..!
శుక్రవారం రాత్రి భారీ వర్షం నగరాన్ని ముంచెత్తడంతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు నరకం అనుభవించారు. కిలోమీటర్ దూరం వెళ్లేందుకు కూడా గంటలకొద్దీ సమయం పడుతుండటంతో వానలో సిటీ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో మదాపూర్ నుంచి మియాపూర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే రహదారిలోనూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు. ఇటు చే నంబర్ రోడ్డులోనూ, అటు జుబ్లీహిల్స్, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
కుత్బుల్లాపూర్ 6.18 సెం.మీ
మాదాపూర్ 5.88 సెం.మీ
కుత్బుల్లాపూర్(జీహెచ్ఎంసీ) 4.48 సెం.మీ
బాలానగర్ 2.83 సెం.మీ
ఆసిఫ్ నగర్ 1.40 సెం.మీ
Comments
Please login to add a commentAdd a comment