
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండో రోజూ భాగ్యనగరంలో వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, లక్డీకాఫూల్, నాంపల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాంపల్లిలో భారీ వర్షం కారణంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం ఆలస్యం కానుంది. ప్రారంభోత్సవానికి చేసిన ఏర్పాట్లు వర్షానికి తడిసిపోయాయి. వర్షం నీరు భారీగా చేరడంతో దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నుమాయిష్ పారిశ్రామిక ప్రదర్శన రోజునే భారీ వర్షం రావడంతో సందర్శకులు సంఖ్య తగ్గే అవకాశముంది.
కాగా, మంగళవారం ఉదయం కూడా హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం పడింది. వర్షానికి తోడు చలిగాలులు వీస్తుండటంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. గురువారం కూడా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment