ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ భద్రత ఏర్పాటు...
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్‌పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కమాండెంట్ మాధవరావు అన్నారు. శుక్రవారం ప్రాజెక్ట్ భద్రత ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ డీఎస్పీ పద్మనాభ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆనకట్ట ఎంత పొడువు ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణ క్రమం, ప్రాజెక్ట్‌కు రక్షణ గురించి ఎస్‌ఈ శ్యాంసుందర్‌ను అడిగారు. భద్రత కోసం డ్యాంపై గుర్తించిన 8 పాయింట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని 2007లోనే ఇంటెలిజెన్సీ విభాగాలు హెచ్చరించాయని, అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లకు భారీ భద్రత కల్పించాలని నిర్ణయించిందని చెప్పారు. నాగార్జున సాగార్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ల మాదిరిగా ఎస్సారెస్పీకీ భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ ఈఈ రామారావు, డ్యాం డిప్యూటీ ఈఈ మొయినొద్దీన్‌ఖాన్, ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, డ్యాం ఏఈ బోజదాసు, ఆర్మూర్ రూరల్ సీఐ నరసింహ స్వామి, బాల్కొండ ఎస్సై సురేశ్ ఉన్నారు.