వరద గోదారిపై హైఅలర్ట్ | High Alert on Floods Godavari | Sakshi
Sakshi News home page

వరద గోదారిపై హైఅలర్ట్

Published Mon, Sep 26 2016 2:27 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

వరద గోదారిపై హైఅలర్ట్ - Sakshi

వరద గోదారిపై హైఅలర్ట్

* అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్
* అన్ని చర్యలు తీసుకోండి.. ప్రాణనష్టం జరగకూడదు
* లోతట్టు ప్రాంతాలవారిని రక్షిత ప్రదేశాలకు తరలించండి
* మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించాలి
* రెండేళ్ల వరకు కరువుండదని వ్యాఖ్య.. వరదలపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్: గోదావరికి వరద పోటెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మంత్రులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సమన్వయం చేసుకుంటూ పని చేయాలని, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా స్పందించాలన్నారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

సోమవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం సేకరించాలని, అవసరమైన సూచనలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి సూచించారు. మనుషులు, మూగజీవాల ప్రాణాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. అధికారుల సూచనలు పాటించి ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
 
ప్రాజెక్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ

గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండాయని, లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని సీఎం చెప్పారు. ఇన్‌ఫ్లోలను బట్టి ఔట్‌ఫ్లోలను నిర్ధారించుకోవాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. ప్రతీ ప్రాజెక్టు వద్ద నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తంగా ఉంచి, పర్యవేక్షించాలన్నారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌తోపాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు నిండాయని, చెరువులు అలుగుపోయడంతో గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. మరో రెండేళ్ల వరకు కరువు దరిచేరని విధంగా వర్షాలున్నాయని వ్యాఖ్యానించారు.

గోదావరి, కృష్ణా నీళ్లను హైదరాబాద్ మంచినీటి అవసరాలకు వాడాలని, గండిపేట, హిమాయత్‌సాగర్ నీళ్లను యథావిధిగా ఉంచడం వల్ల నగర పరిధిలో భూగర్భ జలమట్టం పెరుగుతుందన్నారు. చెరువు కట్టలను ఎప్పటికప్పుడు గమనించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, చెరువులను చూసేందుకు వెళ్లే సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పోలీసులు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
 
ప్రమాదకరస్థాయికి గోదావరి!
వరదలతో ఉప్పొంగుతున్న గోదావరి ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని సీఎం అన్నారు. ఎగువన మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున వరద ప్రవాహం వస్తోందని, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, సింగూరు తదితర ప్రాజెక్టులన్నీ నిండాయన్నారు. వాటి నుంచి నీరు విడుదల చేస్తున్నందున గోదావరికి గంటగంటకూ నీటి ప్రవాహం పెరుగుతుందన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకల ద్వారా భారీగా నీరు గోదావరిలోకి చేరుతోందన్నారు. అందువల్ల కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

గోదావరి ప్రవాహ ఉధృతి ఆదివా రం రాత్రికి 8 లక్షల క్యూసెక్కులకు చేరుతుందన్న అంచనా ఉందన్నారు. ఏటూరునాగారం వద్ద బస చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను, భద్రాచలం వద్ద ఉండి ఎప్పటికప్పుడు స్పందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సీఎం ఆదేశించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement