
సాక్షి, హైదరాబాద్: ‘కారణాలు వెల్లడించకుండానే కాళేశ్వరం పనులు ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని చెబుతున్నారు.. మరి ఆ కారణాలు తెలియకుండా దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలా విచారణ జరుపుతాం’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ పనులూ కొనసాగించొద్దని, పనులన్నీ వెంటనే నిలిపేయాలని ఈ నెల 5న ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఉత్తర్వుతో రోజుకు రూ.100 కోట్ల నష్టం వాటిల్లుతోందంటూ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యం విషయమై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం ముందు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి సోమవారం ఉదయం ప్రస్తావించారు. ప్రాజెక్టు పనులు నిలిపేయాలని హడావుడిగా ఎన్‌జీటీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనంలో ఓ సభ్యుడు పదవీ విరమణ చేస్తున్నప్పుడే మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తాము చేపడుతున్నది తాగునీటి ప్రాజెక్టు పనులేనని, ఇందుకు అటవీ అనుమతులు అవసరంలేదని ఎన్‌జీటీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.
ధర్మాసనం స్పందిస్తూ.. సెలవులు వచ్చినప్పుడు ఉత్తర్వుల కాపీ అందకపోవడం సహజమేనని.. ప్రాజెక్టు పనులను ఏ కారణాలతో ఎన్‌జీటీ నిలిపేసిందో తెలుసుకోకుండా విచారణ చేపట్టడం కష్ట సాధ్యమని పేర్కొంది. తీర్పు పూర్తి పాఠం కోసం ప్రయత్నిస్తున్నామని ఏజీ చెప్పగా, మధ్యాహ్నం విచారణ జరిపేందుకు ప్రయత్నిస్తామంది. కానీ మిగిలిన కేసుల విచారణతోనే కోర్టు సమయం ముగియడంతో వ్యాజ్యం విచారణ జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment