ఆర్టీసీ సమ్మె: మంత్రులు స్పందిస్తే రాజకీయ సంక్షోభమే! | High Court May Again Hear On TSRTC Strike | Sakshi
Sakshi News home page

కోర్టులో చేతిలో ‘చక్రం’

Published Fri, Oct 18 2019 2:36 AM | Last Updated on Fri, Oct 18 2019 8:33 AM

High Court May Again Hear On TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలంటూ కార్మిక సంఘాలకు, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సూచించినా రెండు వైపుల నుంచి ఎక్కడా ఆ వాతావరణం కనిపించటం లేదు. తాము చర్చలకు సిద్ధమే నని, కానీ ఎవరితో చర్చించాలో తేల్చాల్సింది ప్రభుత్వమేనంటూ కార్మిక సంఘాలు చెబు తుండగా తాత్కాలిక ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలంటూ ఆదేశించిన ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మరో సారి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవ కాశం కనిపిస్తోంది. కోర్టు ఏం చెబుతుందోనని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో వైపు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆర్టీసీ సమ్మెపై గురువారం వాకబు చేయడం ప్రాధా న్యత సంతరిం చుకుంది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ హుటా హుటిన రాజ్‌భవన్‌ చేరుకొని సమ్మె పరిణామాలను ఆమెకు వివరించారు. ఈ నేపథ్యంలో సమ్మెకు పరిష్కారం లభించే అవ కాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కోర్టు ఏం చెబుతుందో...
ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిల్‌పై కొనసాగిన వాదనల సమయంలో హైకోర్టు పలు సూచ నలు చేసింది. శుక్రవారం మరోసారి ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. సమ్మె మొదలైన తొలి రోజు సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరని వారు సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసుకున్నట్టేనంటూ తేల్చిచెప్పిన సీఎం.. బుధవారం రాత్రి రవాణాశాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శితో సుదీర్ఘంగా చర్చించారు. శుక్ర వారం కోర్టులో అనుసరించాల్సిన వ్యూహంపై మరోసారి భేటీ కానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నా అటువంటి సమావేశం ఏదీ జరగ లేదు. ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడే అవకాశం లేదని అధికారులు చెబుతుండటంతో కోర్టు చేసే సూచ నల ఆధారంగా శుక్రవారం కీలక నిర్ణ యాలు వెలువడే అవకాశం ఉందని  భావిస్తున్నారు.

కొనసాగుతున్న నిరసనలు...
కార్మిక సంఘాలు మాత్రం ఉద్యమ కార్యాచర ణను కొనసాగిస్తున్నాయి. 13వ రోజు సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ధూంధాం నిర్వహించాయి.  నిరసనల్లో పాల్గొన్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ముట్టడి జరగనుందనే సమాచారంతో గురువారం పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రగతి భవన్‌ వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేసి ఓయూ క్యాంపస్‌ వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఇక ఇందిరాపార్కు వద్ద ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు నిర్వహించారు. రామ్‌నగర్‌ చౌరస్తాలో బైక్‌ర్యాలీ నిర్వహించేందుకు వెళ్లిన ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్‌ హనుమంతు సహా కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అక్కడే ధూంధాం నిర్వహిస్తామని, దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ హాజరవుతారని ఆయన వెల్లడించారు.

రాజ్యాంగ సంక్షోభం రావచ్చు: అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వాత్థామరెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి ఒకరికే శాశ్వతం కాదని, కేసీఆర్‌ కంటే బలమైన ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 1993–94లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. సమ్మెపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసే కొందరు మంత్రులు ఇంటికి వెళ్లి బాధపడుతున్నారని, తనతో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడుతూనే ఉన్నారని గురువారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. కావాలంటే తన కాల్‌డేటా చెక్‌చేసుకోవచ్చన్నారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురవుతోందని ఆయన ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేధావులు ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటం సరికాదని, అది రాష్ట్రానికి మంచి చేయదన్నారు. వారు స్పందిస్తే రాజకీయ సంక్షోభం రావచ్చని వ్యాఖ్యానించారు. వచ్చే నాలుగేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండొచ్చని, కానీ రాజు, మంత్రి తానే అన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలన్నారు. ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని ప్రభుత్వం అంటోందని, ఎలా సాధ్యమో చర్చలకు పిలిస్తే చెప్తానని వెల్లడించారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ ఆస్తులను అధికార పార్టీ నేతలకు కట్టబెడుతున్నారని, ఆ వివరాలను కూడా ప్రజలకు వెల్లడిస్తానని ఆయన హెచ్చరించారు.

ప్రజలకు ఇబ్బంది కలగొద్దు: గవర్నర్‌
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం రాజ్‌భవన్‌లో సమీక్షించారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మను ఆమె పిలిపించుకొని వివరాలను సేకరించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నంటినీ చేయాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల నుంచి తనకు విజ్ఞప్తులు అందాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

బస్సుల్లో టికెట్ల జారీ...
ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారన్న ప్రయాణికుల ఫిర్యాదుతో అన్ని బస్సుల్లో టికెట్ల జారీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో గురువారం చాలా బస్సుల్లో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 74 శాతం బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. 4,705 ఆర్టీసీ, 1,967 అద్దె బస్సులు, వాటికి అదనంగా ప్రైవేటు వాహనాలు నడిపినట్లు తెలిపారు. 1,941 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు వివరించారు. 1,024 బస్సుల్లో మాత్రం టికెట్‌ జారీ యంత్రాలను వినియోగించామన్నారు. ఈ సంఖ్యను శుక్రవారం పెంచుతామన్నారు.

గ్రేటర్‌లో డ్రైవర్లకు అదనంగా రూ. 250 చెల్లింపు
తాత్కాలిక డ్రైవర్లతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడుస్తున్నా హైదరాబాద్‌లో మాత్రం సమస్య తీవ్రంగా ఉంది. ట్రాఫిక్‌లో బస్సులు నడపడం ఇబ్బందిగా ఉంటున్నందున నగరంలో పనిచేసేందుకు తాత్కాలిక డ్రైవర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో 50 శాతం బస్సులు రోడ్డెక్కడం కూడా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు రూ.1,500 చొప్పున చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రూ. 1,750గా ఖరారు చేసింది. శుక్రవారం నుంచి డ్రైవర్లకు ఈ అదనపు మొత్తం చెల్లించనుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా శనివారం తాము కూడా ఆటో బంద్‌ చేస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ యూనియాన్‌ జేఏసీ ప్రకటించింది.

ఎస్‌ఐ కాళ్లు పట్టుకున్న కార్మికుడు...
సమ్మెకు సహకరించాలని అయిల్‌రెడ్డి అనే డ్రైవర్‌ డిపో ఎదుట ఓ ఎస్‌ఐ కాళ్లు పట్టుకున్నాడు. కార్మికులపై కనికరం చూపాలని ప్రాధేయపడ్డాడు. సీఎం కేసీఆర్‌ వైఖరితో తమ కుటుంబాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో గురువారం తాత్కాలిక కండక్టర్‌ ఉద్యోగాల కోసం వచ్చిన మహిళలపై మహిళా కండక్టర్లు దాడికి యత్నించడం కలకలం రేపింది. దీంతో బాధితులు భయాందోళనతో పరుగులు తీశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement