సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లకోసం రాజ్యాంగ సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ఈ 10 శాతం రిజర్వేషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వంగా రామచంద్రగౌడ్ వాద నలు వినిపిస్తూ, రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావన లేదని, అందువల్ల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేవిధంగా ఉందన్నారు. కులాల వారీగా జనాభా లెక్కలను తేల్చకుండా ఇష్టానుసారం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే శాస్త్రీయ పద్ధతిలో కులాల వారీగా జనాభా లెక్కలను తేల్చిన తరువాతనే రిజ ర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, ప్రతివాదులుగా ఉన్న కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి, తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
‘ఆ స్థలాల రక్షణపై ఏం చర్యలు తీసుకున్నారు?’
ప్రభుత్వాస్పత్రుల స్థలాల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఉస్మానియా సూపరింటెండెంట్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డలోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని ఏజీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment