విలువైన ఆస్తులను తమ ఉద్యోగులకు ధారాదత్తం చేయరాదని, ఈ విషయంలో నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించాలని టీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థలు, చట్టబద్ధంగా ఏర్పడిన కార్పొరేషన్లు తమ విలువైన ఆస్తులను తమ ఉద్యోగులకు ధారాదత్తం చేయరాదని, ఈ విషయంలో నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించాలని టీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు తమ భూములను ఉద్యోగులకు కేటాయించాలనుకుంటే, అందుకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక స్థానిక సంస్థలు, కార్పొరేషన్లకు చెందిన స్థలాలను ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఆక్రమించుకుని ఉంటే, వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఇటీవల తీర్పు వెలువరించారు. వరంగల్ జిల్లా, హన్మకొండలోని టీచర్స్ కాలనీలో నాలా స్థలాలను ఆక్రమించుకున్నారని, వాటిని ఖాళీ చేయాలని పలువురికి అధికారులు నోటీసులు జారీచేశారు. అధికారుల చర్యలను సవాలు చేస్తూ పి.సారయ్య, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారణ జరిపి ఆక్రమణల నుంచి పిటిషనర్లను ఖాళీ చేయించి, నాలాను పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక సంస్థలు, కార్పొరేషన్ల భూములను ఉద్యోగులకు కేటాయించరాదని స్పష్టం చేశారు.