
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. కరోనా బాధితుల గణాంకాలను గారడీగా అభివర్ణించింది. మరణించిన వారి మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు మే 18, 26 తేదీల్లో ఉత్తర్వులిచ్చినా ప్రభుత్వం అమలు చేయకుండా అరకొర సమాచారంతో కోర్టును మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఎలాగని ప్రశ్నించింది. గాంధీ ఆస్పత్రికి వైద్యా నికి వెళ్తే తిరిగి వస్తారనే నమ్మకం లేని పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పహాడీషరీఫ్, అజీజ్‌నగర్‌లో ఈ నెల 2న వరుసగా 32, 7 చొప్పున కేసులు నమోదైతే, అదేరోజు రంగారెడ్డి జిల్లాలో 7 కేసులే నమోదయ్యాయని ప్రభుత్వం చెబుతుంటే నమ్మకం కలగట్లేదని వ్యాఖ్యానించింది. పరీక్షలు చేయకపోవడం, పీపీఈ కిట్లు ఇవ్వకపోవడం, మృతదేహాలకు పరీక్షలు మొదలైన ప్రజాహిత వ్యాజ్యాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
అప్పటివరకు అమలు చేయాల్సిందే..
ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం మృతదేహాలకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు చెప్పడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షల్లో ఒకవేళ పాజి టివ్ అని తేలితే మృతుడి కుటుంబసభ్యులకు పరీక్షలు చేయొచ్చు కదా అని పేర్కొంది. కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని ఏజీ చెప్పారు. దీంతో ధర్మాసనం కల్పించుకుని, తామిచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వనంత వరకు హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తమ ఉత్తర్వుల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బయట తిరగడం వల్లే కరోనా..
వైద్య సిబ్బంది అందరికీ పీపీఈ కిట్లు అందజేసి ఉంటే 72 మంది డాక్టర్లకు పాజిటివ్ వచ్చేది కాదని, 400 మంది వైద్య సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే వైద్య సిబ్బందిలో చాలా మంది హాస్టల్స్‌లో ఉన్నారని, ఇతర సమయాల్లో బయటకు వెళ్లడం వల్లే సోకిందని ఏజీ పేర్కొన్నారు. కరోనా నివారణ వైద్యానికి ఓ ప్రైవేట్ ఆస్పత్రి రూ.24 లక్షలు వసూలు చేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని గుర్తు చేసింది. కరోనాకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తుందీ లేనిదీ తెలపాలని ఆదేశించింది. కాగా, కరోనా గురించి ప్రజలకు పారదర్శకంగా వాస్తవాలు తెలపాలని, కేసుల వివరాలు వెల్లడిస్తే ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారని, లేకపోతే ఏం కాదులే అనే ధైర్యంతో బయటకు వెళ్లి ప్రమాదం కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసుల వివరాల్ని పత్రికల్లో మొదటి పేజీల్లో వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment