సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్స కోసం వస్తున్న రోగుల బంధువులతో కొన్ని ప్రై వేటు ఆసుపత్రులు.. వైద్య చికిత్సలు, తీసుకున్న ఫీజులపై ఎవరికీ ఫిర్యాదు చేయబోమని, కేసులు పెట్టబోమని, కోర్టులను ఆశ్రయించబోమని రాయిం చుకోవడం చట్ట విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. అలా రాయించు కోవడానికి వీల్లేదని స్పష్టంచేసింది. రాయించుకున్నా వాటికి చట్టబద్ధత ఏమీ ఉండదని తేల్చి చెప్పింది. ఫీజుల విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశిం చాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.
ఫీజులపై ప్రచారం చేయండి
‘నిబంధనలకు విరుద్ధంగా, అదనంగా వసూలు చేసిన ఫీజులను ఆయా ఆసుపత్రుల నుంచి వెనక్కు ఇప్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఇవ్వకపోతే ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించాలి. నేరుగా లైసెన్సులు రద్దు చేస్తే వారు బాధితులకు తిరిగి డబ్బు చెల్లించే అవకాశం లేకుండా పోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలకు, ల్యాబ్ పరీక్షలకు ధరలను నిర్ణయించాలి. ఈ మేరకు వీలైనంత త్వరగా జీవో జారీ చేయాలి. ఈ జీవోను వైద్య ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. ఈనెల 10వ తేదీ లోగా జీవో జారీ చేయకపోతే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి హాజరై జాప్యానికి కారణాలను వివరించాలి’అని స్పష్టం చేసింది.
టీచర్ల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు?
‘కరోనాతో పనులు లేక అర్ధాకలితో జీవనం వెళ్లదీస్తున్న నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారా? ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనా బారిన పడిన టీచర్లకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? కరోనా మూడో దశలో ప్రధానంగా చిన్నారులకు వైరస్ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న తరం చిన్నారులను కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, మెరుగైన వైద్యం అందించేందుకు, వైద్య సిబ్బంది నియామకానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? కరోనా బారిన పడిన కుటుంబాల్లో ఇతర వ్యక్తులు నిరాశ, నిస్పృహలకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి వారిలో ధైర్యం నింపేందు కు, అవసరమైన వారికి మానసిక చికిత్స అందించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?
కరోనా మూడో దశ కట్టడికి ఏం ప్రణాళికలు రూపొందించారు? బ్లాక్ ఫంగస్ రోగులకు ఔషధాల కొరత ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఔషధాలు సమకూర్చుకునేందుకు ఏం చర్య లు తీసుకుంటున్నారు? 18–44 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్ అందించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? వాక్‌ఇన్స్ తరహాలో మైదానంలో కార్ల దగ్గరికి వచ్చి వ్యాక్సిన్ వేసేలా ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలేంటి?’తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పౌర సరఫరాలు, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులను ఆదేశిస్తూ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ప్లాంట్
‘కరోనా మొదటి దశలో అధికంగా ఫీజులు వసూలు చేశారంటూ ప్రైవేటు ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి రూ.3 కోట్ల వరకు వెనక్కు ఇప్పించినట్లు ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలిపారు. ‘ఒక రోగికి రూ.17 లక్షలు బిల్లు వసూలు చేయగా.. ఆ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఒప్పించి రూ.10 లక్షలు వెనక్కు ఇప్పించాం. కరోనా చికిత్సలకు రాష్ట్రవ్యాప్తంగా 1,200 పైచిలుకు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చాం. రెండో దశలో ప్రైవేటు ఆసుపత్రులపై 174 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికంగా ఫీజులు తీసుకున్నారన్న ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. షోకాజ్ నోటీసులు జారీ చేసి వారిచ్చే వివరణ ఆధారంగా ఆయా ఆసుపత్రులు కరోనా రోగులకు చికిత్సలు చేయకుండా ఆదేశాలు జారీ చేస్తున్నాం. ప్రైవేటు నర్సింగ్ హోం అసోసియేషన్‌తో చర్చించి చికిత్సల ధరలు నిర్ణయిస్తాం. 200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం కల్గిన ఆక్సిజన్ ప్లాంట్‌ను నగర శివార్లలోని పాశమైలారంలో త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’
– డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య విభాగం
ఏపీ తరహా చర్యలకు ఆదేశించండి
కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకన్నా ఎక్కువ ఫీజులు వేయకుండా పర్యవేక్షించేందుకు ప్రతి ఆస్పత్రికి నోడల్ అధికారిని నియమించిందని చెప్పారు. ఇదే తరహాలో ఇక్కడా నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 90 లక్షల మంది తెల్లకార్డుదారులు పనులు లేక ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇచ్చిన తరహాలో 25 కేజీల బియ్యం, రూ.2 వేలు ఆర్థికసాయం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
చదవండి: అన్ని భవిష్యత్తులోనే చేస్తారా: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment