డెంగీకి బలవుతున్నా పట్టించుకోరా? | High Court Slams On TRS Govt On Dengue Deaths | Sakshi
Sakshi News home page

డెంగీకి బలవుతున్నా పట్టించుకోరా?

Published Thu, Oct 24 2019 2:12 AM | Last Updated on Thu, Oct 24 2019 2:12 AM

High Court Slams On TRS Govt On Dengue Deaths - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘డెంగీ వంటి విషజ్వరాలతో జనం చచ్చిపోతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేసినా ఫలితాలు కనబడటం లేదు. ఇప్పటికే ఎంతో సమయమిచ్చాం. సాక్షాత్తు ఒక జడ్జి డెంగీ కారణంగా మృత్యువాత పడ్డారు. ఆ జడ్జి ఇంట్లో వైద్యులు కూడా ఉన్నారు. డెంగీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనకు పెద్ద పీట వేసుంటే ఎంతోమంది ప్రాణాల్ని కాపాడేందుకు వీలవుతుంది. ప్రజలు డెంగీ వంటి రోగాల బారినపడి చచ్చిపోతుంటే కళ్లు మూసుకుని ఉంటామని అనుకోవద్దు. ఇలాంటి విషయాల్లో తీవ్రంగానే స్పందిస్తాం..’అని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జనం రోగాల బారిన పడుతుంటే ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోందని, డెంగీ కారణంగా మూడ్రోజుల క్రితం ఒక జడ్జి (హన్వాడకు చెందిన పి.జయమ్మ ఖమ్మంలో రెండో అదనపు ప్రథమశ్రేణి జడ్జి. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో 19న కన్నుమూశారు.) మరణించారని, ఎవరైనా బ్యూరోక్రాట్‌ ఇంట్లో అలాంటి ఘటన జరిగితేగానీ ఉన్నతాధికారులు స్పందించరా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికారులు ఏం చేస్తున్నారో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ గురువారం జరిగే విచారణకు స్వయంగా హాజ రు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్లేగు తరహాలో ప్రబలితే.. 
డెంగీ నివారణకు ప్రభుత్వ పరంగా చర్యలు నామమాత్రంగా ఉన్నాయని, డెంగీ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ డాక్టర్‌ ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం, న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను పిల్‌గా పరిగణించిన వాటిని బుధవారం హైకోర్టు మరోసారి విచారించింది. వందల పేజీలతో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా ప్రభుత్వం డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకున్న చర్యలు, డెంగీ నివారణకు అందిస్తున్న వైద్య సేవల సమాచారం పట్ల ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని ఏం చర్యలు తీసుకున్నారో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మనుషులు మోసే ఫాగింగ్‌ మెషీన్లు కాదని, డ్రోన్స్‌ ద్వారా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచన చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడింది. సరైన సమయంలో ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చునని, 1,300లో యూరప్‌లో ప్లేగు వచ్చి ఎంతోమంది ప్రజల్ని పొట్టనబెట్టుకుందని ధర్మాసనం గుర్తు చేసింది. మహమ్మారి కన్నెర్రజేస్తే పేదవాడు, ధనికుడు, రాజు, రాణి అనే తారతమ్యం ఉండదని, అప్పుడు యూరప్‌లో ఇద్దరు పోప్‌లు కూడా చచ్చిపోయారనే చారిత్రక విషయాన్ని తెలిపింది. కళ్లు తెరవాల్సిన సమయం వచ్చింది. ఇదే సరైన సమయం. మేల్కొనండి.. అని ప్రభుత్వానికి హితవు పలికింది.
 
కార్చిచ్చు కాకముందే కళ్లు తెరవండి.. 
తొలుత వాదనలు ప్రారంభమైన వెంటనే ఏజీ లేచి.. డెంగీ నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని, జనం రోగాల బారినపడి ఇబ్బందులు పడుతున్నప్పుడే తాము అనేక సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడ్రోజుల క్రితం ఒక జడ్జి చనిపోయారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పైగా ఆ జడ్జి కుటుంబంలో డాక్టర్లు కూడా ఉన్నారని, అయినా డెంగీపై ప్రభుత్వం అవగాహన కల్పించని కారణంగా ప్రాణాలు పోయాయనే అభిప్రాయం ఏర్పడుతోందని వ్యాఖ్యానించింది. డెంగీ జ్వరాలు రావడానికి కారణాలేమిటి, అది రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు వేటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తున్నట్లుగా హైదరాబాద్‌లోనే ఎక్కడా కనబడటం లేదని తప్పుపట్టింది. డెంగీ వంటి విషజ్వరాల్ని నిర్లక్ష్యం చేస్తే కార్చిచ్చులా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రచారం కూడా చేస్తున్నామని ఏజీ చెప్పారు. చిన్నచిన్న బోర్డుల్ని ఏర్పాటు చేశారేమో తెలియదు గానీ, హైదరాబాద్‌లో పెద్ద పెద్ద హోర్డింగ్స్‌లో డెంగీ గురించి కనబడలేదని ధర్మాసనం తెలిపింది. నివారణ చర్యలు తీసుకున్నందునే దోమలు, విష జ్వరాల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని ఏజీ చెప్పగానే తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుని, సెప్టెంబర్‌లో 205 కేసులుంటే అక్టోబర్‌ నాటికి 409 అయ్యాయని, రోగుల సంఖ్య రెట్టింపైనట్లుగా మీరు అందించిన పత్రాల్లోనే ఉందని చెప్పింది.
 
కౌంటింగ్‌ మెషీన్‌ కాదు.. కిల్లింగ్‌ మెషీన్లు కావాలి 
దోమల లెక్కల మెషీన్ల ద్వారా చూస్తే దోమల సంఖ్య తగ్గిందని ఏజీ చెప్పగానే మళ్లీ ధర్మాసనం.. దోమల కౌంటింగ్‌ మెషీన్ల కంటే దోమల కిల్లింగ్‌ మెషీన్లు అవసరమని గట్టిగా చెప్పింది. దోమల సంఖ్య తగ్గిందని, కొద్దిగానే దోమలు ఉన్నాయని ఏజీ చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఉన్న దోమలేమీ కూర్చుని ఉండవని, వ్యాప్తి చెందుతాయని, ఉన్నవి తిరగబడితే విషజ్వరాలు రావని గ్యారెంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఫ్రైడే మస్కిటో డ్రై డే.. అనే నినాదాన్ని (శుక్రవారం దోమల నియంత్రణ దినం) ప్రభుత్వం అమలు చేస్తోందని ఏజీ చెప్పారు. దీనిపై ధర్మాసనం ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఏటా గాంధీజయంతి అక్టోబర్‌ 2న మద్యం అమ్మకాల నిషేధం సందర్భంగా డ్రై డే.. అమలు చేస్తారని తెలుసునని, దోమల్ని అంతం చేసేందుకు ఒక రోజును ఎంచుకోవడం ఏమిటో, వారంలోని మిగిలిన ఆరు రోజుల మాటేమిటో, అసలు ఆ నినాదం ఏమిటో, ఆ భాష ఏమిటో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement