పరీక్షలు ఆన్‌లైనా? భౌతికమా?  | Telangana High Court Asks Government About Clarity Of Degree Exams | Sakshi
Sakshi News home page

పరీక్షలు ఆన్‌లైనా? భౌతికమా? 

Published Tue, Sep 15 2020 4:03 AM | Last Updated on Tue, Sep 15 2020 9:22 AM

Telangana High Court Asks Government About Clarity Of Degree Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని, భౌతికంగానే నిర్వహించాలని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌ అన్ని కళాశాలలకూ ఈ నెల 11న ఉత్తర్వులు జారీచేశారు. అదే కమిషనర్‌....అటానమస్‌ కళాశాలలు తమకు ఇష్టమైన రీతిలో పరీక్షలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఇస్తూ 12న మరో ఉత్తర్వు ఇచ్చారు. ఇలా పరస్పర విరుద్ధంగా, పొంతన లేకుండా ఆదేశాలు జారీచేస్తే ఎలా?’’అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించేలా ఆదేశించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బీవీ నర్సింగ్‌రావు, గరీబ్‌గైడ్‌ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది.

పరీక్షలు భౌతికంగా మాత్రమే నిర్వహించాలని, ఆన్‌లైన్‌లో జరపడానికి వీల్లేదని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌ అన్ని కళాశాలలు, యూనివర్సిటీలకూ ఉత్తర్వులు జారీచేశారని ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. అయితే అటానమస్‌ కళాశాలలు, వర్సిటీలు ఎలాగైనా పరీక్షలు నిర్వహించుకునేందుకు స్వేచ్ఛనిస్తూ మరో ఉత్తర్వు జారీచేశారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘ఎలాగైనా అంటే?...ఆన్‌లైన్‌లో కూడా పరీక్షలు నిర్వహించుకోవచ్చనా? పరీక్షల షెడ్యూల్‌ను ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చనా?’అని సందేహం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌లోనూ నిర్వహించుకోవచ్చని, అటానమస్‌ కళాశాలల్లో 600 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, అందువల్ల వారికి ఈ విధానంలో పరీక్షలు నిర్వహించడం సులభమని అడ్వకేట్‌ జనరల్‌ అన్నారు. అయితే వర్సిటీలు, వర్సిటీల గుర్తింపు ఉన్న కళాశాలల్లో 2,40,356 మంది యూజీ, 30,922 మంది పీజీ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉందని చెప్పారు. వీరు తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని, ఇప్పుడు రాయలేని వారికి తర్వాత స్పెషల్‌ సప్లిమెంటరీ నిర్వహిస్తామన్నారు. అందులో ఉత్తీర్ణత సాధించినా రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణిస్తామని తెలిపారు.

జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ యూనివర్సిటీ కూడా భౌతికంగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని వర్సిటీ తరఫు న్యాయవాది ధర్మేష్‌ జైశ్వాల్‌ నివేదించారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హైదరాబాద్‌ వరకు రావాల్సిన అవసరం లేదని, వారి నివాస ప్రాంతానికి సమీపంలోని కళాశాలల్లోనే రాయ చ్చొని తెలిపారు. అయితే, భౌతికంగానే పరీక్షలు నిర్వహించాలనేదానికి సహేతుక కారణాలను చూపించలేదని, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు హైదరాబాద్‌కు రావడం ప్రయాసతో కూడుకున్నదని, ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. పరీక్షలు ఏ విధానంలో నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపర నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో, మరికొందరికి భౌతికంగా పరీక్షలు నిర్వహించడం వివక్ష చూపించడమేనని విద్యార్థుల తరఫున న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం...పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీచేయాలని, వాటిని తమకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement