దివ్యాంగుల సంక్షేమానికి నిధులు పెంచండి  | High Court Reference To State Government For Welfare Of The Divine | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమానికి నిధులు పెంచండి 

Published Sun, Jun 21 2020 4:41 AM | Last Updated on Sun, Jun 21 2020 4:41 AM

High Court Reference To State Government For Welfare Of The Divine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగుల జనాభా నిష్పత్తి ప్రకారం వారి సంక్షేమానికి వెచ్చించే నిధులను పెంపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల వారికి కష్టాలు పెరిగాయని, లాక్‌డౌన్‌లో దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నదీ లేనిదీ తెలియజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉండాలని, లేకపోతే వారు కుటుంబానికి భారమే అనే భావన ఏర్పడే ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడింది. ఈమేరకు ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

లాక్‌డౌన్‌ కారణంగా బయటకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులకు మందులు, నిత్యావసరాలను అందజేసేందుకు స్వచ్ఛంద సంస్థల వారిని అనుమతించాలని కోరుతూ శివ గణేష్‌ కర్నాటి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కోర్టు మరోసారి విచారించింది. లాక్‌డౌన్‌లో దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆ శాఖ కమిషనర్‌ బి.శైలజ ప్రభుత్వాన్ని అభ్యర్థించారంటూ నివేదికను అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ హైకోర్టుకు అందజేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.పవన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలకు రూ. 5లక్షలు చొప్పున కేటాయించిన ప్రభుత్వం మిగిలిన జిల్లాలకు రూ. లక్ష చొప్పునే విడుదల చేసిందన్నారు. ఉదాహరణకు వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాల్లోనే 45 లక్షల మంది దివ్యాంగులు ఉంటే ప్రభుత్వం కేటాయింపులు ఏమాత్రం సరిపోవని తెలిపారు. ప్రభుత్వ సాయం కోసమే చాలా మంది దివ్యాంగులు నిరీక్షిస్తున్నారని, అయితే ప్రభుత్వం మాత్రం నిధులు కేటాయించడం లేదన్నారు. విచారణ 24కి వాయిదా పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement