కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న టీబీజీకేఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా బాలల సంరక్షణ కేంద్రాన్ని, వృద్ధాశ్రమాన్ని కలిపి ఏర్పాటు చేస్తామని, దీని ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అనాథలు, బాల్యంలోనే నేరాలు చేసి రక్షణ గృహాల్లో ఉన్న చిన్నారులను, అలాగే వృద్ధాశ్రమాలకే పరిమితమైన వృద్ధులను ఒకే చోట ఉంచడం వల్ల సత్ఫలితాలు ఉంటాయన్న హైకోర్టు అభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. వాస్తవానికి వృద్ధాశ్రమాలకు అనుబంధంగా బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. రెండింటినీ ఒకేచోట ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతి సదుపాయాలు ఏమిటో పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వివరించింది.
వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి ఏమైనా అసౌకర్యం కలిగితే ఫిర్యాదు చేసేందుకు వీలుగా 14567 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునేలా జిల్లా ఎస్పీలు, నగర కమిషనర్లకు ఆదేశాలిచ్చినట్లు కోర్టుకు వివరించింది. వృద్ధాశ్రమాల్లో పరిస్థితులపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం, పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ డి.దివ్య ఈ నివేదికను కోర్టు ముందుంచారు.
Comments
Please login to add a commentAdd a comment