‘అన్నల’ ఊరు.. మారెను చూడు | history of madikonda | Sakshi
Sakshi News home page

‘అన్నల’ ఊరు.. మారెను చూడు

Published Sun, Apr 20 2014 3:10 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM

‘అన్నల’ ఊరు.. మారెను చూడు - Sakshi

‘అన్నల’ ఊరు.. మారెను చూడు

కామారెడ్డి, న్యూస్‌లైన్: జిల్లాలోని మాచారెడ్డి మండలంలో మారుమూలన ఉన్న ‘మద్దికుంట’ చరిత్ర ఇది. ఈ గ్రామాన్ని అప్పటి పీపుల్స్‌వార్ నాయకత్వం విముక్తి గ్రామంగా ప్రకటించుకుని తమ మార్కు అభివృద్ధి నమూనాను అమలు చేసింది. పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీగా మారిన తరువాత కూడా రాష్ట్ర కమిటీతోపాటు, కేంద్ర కమిటీ నేతలు సైతం మద్దికుంటలో రోజుల తరబడి మకాం వేసేవారు. అంతర్జాతీయ విప్లవ సంస్థల ప్రతినిధులు సైతం మద్దికుంటకు వచ్చేవారు.

 ఆ ఊరి ప్రజలు కూడా అందరిదీ ఒకే మాట, ఒకే బాటగా నడుచుకుంటూ ముం దుకు సాగారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. 2005 తరువాత మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడం తో మద్దికుంట అన్ని గ్రామాలలాగే రాజకీయ కార్యకలాపాలకు వేదికైంది.

అక్కడ అన్ని పార్టీలకు చెందిన వాళ్లు ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రూపు  ాజకీయాలకు ఆ గ్రామం ఇప్పుడు నిలయంగా మారడం ఆందోళన కలిగి స్తోంది. ‘‘అన్నలున్నపుడే మా ఊరు మంచిగుండె. ఇప్పుడు తాగుడుకు బాగా అలవాటు పడి ఒకనిమీద ఒకరు లొల్లులకు దిగున్నరు’’ అంటూ గ్రామానికి చెందిన 70 వృద్ధుడొకరు గతాన్ని గుర్తు చేసుకున్నారు.

 రెండు దశాబ్దాలు అన్నల చేతులలో
 1982 ప్రాంతంలో అప్పటి పీపుల్స్‌వార్  నేత శీలం నరేశ్ అలియాస్ జగన్ నేతృత్వంలో నక్సల్స్ కార్యకలాపాలు మొదలయ్యాయి. అటవీ అధికారు ల వేధింపులు,పెత్తందారుల ఆగడాలకు అడ్డుపడింది. అప్పటి నుంచి మద్దికుంట ప్రజలు నక్సల్స్‌కు కొం త అనుకూలంగా మారారు. అప్పు  డు వారు ప్రజల పాలన ఎలా ఉం  టుందోనన్న విషయాన్ని అర్థం చేయించారు.

ఆ రోజు మొదలైన అన్నల పాలన రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. ఎందరో మావోయిస్టు నేతలు ఆ గ్రామంతో సంబంధాలు నెరిపారు. వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగా యి. నక్సలైట్లకు సహకరిస్తున్నారంటూ పోలీసులు గ్రామంపై వందల పర్యాయాలు విరుచుకుపడి దొరికినవారిని దొరికినట్టు చితకబాదేవారు.

 వివిధ కేసులలో 250 మందికి పైగా అరెస్టయ్యారు. ఇంటికొకరు ఏదోరకంగా ఇబ్బందిపడ్డవారే. ఒకసారి ఓ మిలిటెంట్‌ను పోలీసులు పట్టుకెళుతుంటే గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్న సందర్భంలో 72 మందిపై కేసులు నమోదయ్యాయి. మరో సందర్భంలో 91 మందిపై కేసులు పెట్టారు.  

 ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి
 గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో అమలు చేయడం మొదలైంది. మొదట్లో విద్యాభివృద్ధికి కృషి జరిగింది. పాఠశాలకు స్థలం లేకపోవడంతో గ్రామస్థుల సహకారంతో రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అదనపు గదులు నిర్మించడానికి ప్రజలు శ్రమదానం చేశారు. అన్నల హవా కొనసాగిన కాలంలోనే గ్రామంలో పదో తరగతి వరకు పాఠశాల అప్‌గ్రేడ్ జరిగింది. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండడంతో విద్యా వాలంటీర్లను నియమించుకున్నారు.

 సబ్‌స్టేషన్ కోసం శ్రమదానం
 లోవోల్టేజీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే వారు. విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం మద్దికుంట, రెడ్డిపేట  గ్రామాల ప్రజలు అప్పటి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ద్వారా అప్ప టి సీఎం ఎన్టీఆర్‌ను కలిశారు. తాము శ్ర మదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సబ్‌స్టేషన్ మంజూరు చేయాలని విన్నవించుకున్నారు. దీంతో ప్రభుత్వం సబ్‌స్టేషన్ మంజూరు చేసింది.

 స్తంభాలకు గుంతలు తీయడం, లాగడం, స్తంభాలను తరలించడం వంటి పనులన్నీ ప్రజలు శ్రమదానంతో చేపట్టారు. దీంతో ఆ గ్రామంలో లోఓల్టేజీ సమస్య తీరింది. గ్రామంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. పశువులకు నీటితొట్టెలు నిర్మించారు. పంట పొలాలకు వెళ్లడానికి రోడ్డు వేయించారు.

 రైతుల కోసం సొసైటీ ఏర్పాటు
 మద్దికుంటలో అధిక శాతం రైతులు పేద, మద్య తరగతివారే. వ్యవసాయానికి పెట్టుబడులు కూడా దొరకని పరిస్థితులు ఎదుర్కొనేవారు. అప్పుడు పీపుల్స్‌వార్ నాయకత్వం గ్రామంలో ఓ సొసైటీని ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేసింది. పంట చేతికొచ్చిన తరువాతనే డబ్బులు చెల్లించేలా చూసేవారు. తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలిగింది.

 ప్రతీ సీజన్‌లో గ్రామానికి ఆరు లారీల ఎరువులు తీసుకువచ్చేవారని గ్రామస్థులు తెలిపారు. ప్రతీ రైతుకూ నాలుగు, ఐదు బస్తాల ఎరువు అందేదన్నారు. ఎరువుల కోసం కామారెడ్డికి వెళ్లి ఇబ్బందులు పడే పరిస్థితులు లేకుండా ఇంటిదగ్గరే దొరికేవని పేర్కొన్నారు. గ్రామంలో పేద రైతులకు సాగునీటి వసతి కల్పించేందుకుగాను నలుగురైదుగురికి కలిపి ఒక బోరు వేయించి మోటార్ బిగించి ఆదుకున్నా రు. ఇలా గ్రామంలో నాలుగైదు బోర్లు తవ్వించడం ద్వారా 20 మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగింది.

 ఎన్నికల బహిష్కరణలో రికార్డు
 శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగినపుడల్లా నక్సల్స్ పిలుపు మేరకు గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించేవారు. పోలీసులు గ్రామానికి వెళ్లి ప్రజలపై ఒత్తిడి తెచ్చే వారు. ఎన్నికలకు ముందు రోజే గ్రామస్తులు పొలాల వద్దకు పరుగులు తీసేవారు. కొన్ని సందర్భాలలో పోలీసులు బలవంతంగా ఓట్లేయించేవారు. 2006 వరకు ఏకగ్రీ వంగా పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలను ఎన్నుకునేవారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement