వరంగల్‌ జిల్లాలో తొలి మున్సిపాలిటీ ప్రస్థానం | History Of Warangal First Muncipality | Sakshi
Sakshi News home page

వరంగల్‌ జిల్లాలో తొలి మున్సిపాలిటీ ప్రస్థానం

Published Sun, Jan 5 2020 10:08 AM | Last Updated on Sun, Jan 5 2020 10:08 AM

History Of Warangal First Muncipality  - Sakshi

సాక్షి, వరంగల్‌:1952లో మొదటిసారి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ సంస్థానం నిజాం నవాబుల పాలనలోనే కొనసాగింది. 1935లో దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించారు. ఒక్క నైజాం(హైదరాబాద్‌) మినహా అన్ని రాష్ట్రాల్లో లోకల్‌ బాడీ ఎన్నికల ద్వారా ప్రజా ప్రతినిధుల పాలన అమలులోకి వచ్చింది. అదే సమయంలో నిజాం నవాబు బల్దియా(మునిసిపల్‌) పరిధిలో తహసీల్దార్‌ను చైర్మన్‌గా నియమించి.. పేరు ప్రఖ్యాతలు ఉన్న ఐదుగురు సభ్యులను నామినేటెడ్‌గా నియమించారు.

అలా 17 ఏళ్ల పాటు కొనసాగిన తహసీల్దార్‌ పాలన 1952లో ముగిసింది. అదే ఏడాది నవంబర్‌లో జనగామలో మొదటిసారి 14 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. వార్డు సభ్యుల ఎన్నికల్లో జనగామ మొదటి చైర్మన్‌గా కోడూరి జగన్నాథరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా పెద్ది నారాయణ ఎన్నికయ్యారు. ఇందులో ముగ్గురు అఫీషియల్స్, మరో ముగ్గురు నాన్‌ అఫీషియల్స్‌ను నామినేటెడ్‌ పద్ధతిలో సభ్యులుగా నియమించారు. వీరి పాలన ఆరేళ్ల పాటు కొనసాగింది.  

అవిశ్వాస తీర్మానాలు..
రెండోసారి 1959లో 17 వార్డులకు ఎన్నికలను నిర్వహించారు. చైర్మన్‌గా రాగి నర్సింహులు, వైస్‌ చైర్మన్‌గా పన్నీరు సోమయ్యను ఎన్నుకున్నారు. ఏడాది తర్వాత అవిశ్వాస తీర్మాణం పెట్టడంతో నర్సింహులు తన పదవి కోల్పోయారు. వార్డు సభ్యుడిగా ఉన్న వెన్నెం వెంకటనర్సింహారెడ్డి మెజార్టీ సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1961 వరకు ఆయన పదవీ కాలం కొనసాగింది. 1965లో మూడోసారి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయగా.. పాకిస్తాన్‌తో యుద్ధం రావడంతో దాన్ని రద్దు చేశారు. 1966లో మూడోసారి 20 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో తిరిగి వెన్నెం వెంకట నర్సింహారెడ్డి రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఐదేళ్ల పాటు పాలన కొనసాగించారు. ఎన్నికల నిర్వహణలో సవరణలతో పాటు రిజర్వేషన్‌ పద్ధతి ద్వారా ఎన్నికలను నిర్వహించాలన్న ఉద్ధేశంతో 1971– 1981 వరకు ప్రత్యేక అధికారి çపర్యవేక్షణలో పాలన కొనసాగించారు. ఆ సమయంలో నలుగురు అధికారులు మారారు. సీఎం అంజయ్య హయాంలో 1982లో నాలుగోసారి పార్టీ రహిత(పార్టీల గుర్తు లేకుండా) 20 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, చైర్మన్‌గా వీరారెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికై ఏడాది పాటు కొనసాగారు.

అవిశ్వాస తీర్మానంలో బలనిరూపణతో చొల్లేటి ప్రభాకర్‌ చైర్మన్‌గా పదవిని అలంకరించారు. రెండున్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభాకర్‌పై వార్డు సభ్యులు అవిశ్వాసం పెట్టి పబ్బా శివకోటిని ఎన్నుకున్నారు. ఇలా 1982– 1987 వరకు ఏకంగా ముగ్గురు చైర్మన్లు మారడం గమనార్హం. 

1987లో డైరెక్టు ఎన్నికలు..
వార్డు సభ్యుల ద్వారా చైర్మన్‌ను ఎన్నుకునే విధానానికి నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు స్వస్తి చెప్పారు. 1987లో ఐదోసారి ఎన్నికలను డైరెక్టు పద్ధతిలో నిర్వహించారు. డైరెక్టుగా నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్‌గా పీటీ దశరథ గెలుపొందారు. 20 మంది వార్డు సభ్యులు కలిసి పజ్జూరి మురళిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆరోసారి 1992లో ఎన్నికలను నిర్వహించారు. చైర్మన్‌గా ఎర్రమళ్ల సుధాకర్‌ డైరెక్టు పద్ధతిలో గెలుపొందగా, వైస్‌ చైర్మన్‌గా సత్యనారాయణరెడ్డిని సభ్యులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆర్టీఓ పాలన కొనసాగింది. 2000లో ఏడో సారి డైరెక్టు ఎన్నికల్లో డాక్టర్‌ కరుణాకర్‌రాజు చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా మోతుకు గౌరారెడ్డి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

2005లో ఎనిమిదో సారి 24 వార్డులకు డైరెక్టు ఎన్నికలు నిర్వహించగా వేమెళ్ల సత్యనారాయణరెడ్డి చైర్మన్‌గా గెలుపొందారు. వైస్‌ చైర్మన్‌గా కంచె రాములును సభ్యులు ఎన్నుకున్నారు. 2010లో సత్యనారాయణరెడ్డి పదవీ కాలం ముగిసిన తర్వాత, 2014 వరకు ఎన్నికలు నిర్వహించలేదు. 2014లో తొమ్మిదో సారి 28 వార్డులకు నిర్వహించిన ఎన్నికల్లో వార్డు సభ్యుల బలనిరూపణతో మొదటిసారి మహిళా చైర్‌పర్సన్‌గా గాడిపెల్లి ప్రేమలతారెడ్డి అధికారం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే, జెడ్పీటీసీగా పోటీకి దిగిన ప్రేమలతారెడ్డి.. ఆరు నెలల ముందుగానే తనపదవికి రాజీనామా చేయగా వైస్‌ చైర్మన్‌గా ఉన్న నాగారపు వెంకట్‌కు చైర్మన్‌ పీఠం దక్కింది.

చీటకోడూరు రిజర్వాయర్‌ ఏర్పాటు
పట్టణ ప్రజలకు దాహార్తి తీర్చాలనే సంకల్పంతో 2005లో 11.13 ఎంఎల్‌డీ సామర్థ్యంతో చీటకోడూరు వద్ద రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి సామర్థ్యం ఆధారంగా.. ప్రతిరోజు .01(73 లక్షల లీటర్లు) తాగునీటిని 120.40 కిలోమీటర్ల పరిధిలోని పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.

రూ.36వేల ఆదాయంతో..
1952లో 12వేల జనాభా.. మూడు వేల నివాస గృహాలతో రూ.36వేల ఆదాయంతో మునిసిపల్‌ ప్రస్తానం ప్రారంభమైంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పట్టణ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించారు. సొంతంగా నిధులను సమకూర్చుకోవాలనే ఉద్ధేశంతో పెద్దల నిర్ణయం మేరకు సైకిళ్లకు లైఫ్‌ ట్యాక్స్‌ను అమలులోకి తీసుకొచ్చారు. ఏడాది రూ.3 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులతో పాటు వ్యాపార పరంగా వివిధ ప్రాంతాల నుంచి జనగామకు వచ్చే ఎడ్ల బండ్లు, ఇతర వాహనాలు టోల్‌ ట్యాక్స్‌ చెల్లించేలా నిబంధనలు పెట్టారు.

ఒక్కో ఎడ్ల బండి నుంచి నాలుగు అణాలు టోల్‌ కింద తీసుకునే వారు. ప్రతీ నివాస గృహ యజమానులు ఏడాది రూ.5 నుంచి రూ.వెయ్యి వరకు ట్యాక్స్‌ చెల్లించే వారు. ఇంటింటికీ నల్లాలు లేకపోవడంతో బోరు బావుల ద్వారా నీటిని వాడుకున్నారు. 1964లో అప్పటి చైర్మన్‌ వెన్నెం వెంకట నర్సింహారెడ్డి ఆరు బోర్లు వేయించి నల్లా కనెక్షన్లు బిగించారు.

అభివృద్ధి కోసం పనిచేసినం..
జనగామ పట్టణ అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో పనిచేసినం. వేసవిలో ట్రాక్టర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. కానీ నా హయాంలో బోరుబావులు తవ్వించేందుకు నిర్ణయం తీసుకోగా.. అప్పటి కలెక్టర్‌ ససేమిరా అన్నారు. అయినప్పటికీ బోరుబావుల అవసరాన్ని ఆయనకు వివరించి తాగునీటి సమస్య లేకుండా చేసినం. జనగామను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు సఫలీకృతమయ్యాయి.
– వెన్నెం వెంకటనర్సింహారెడ్డి, మునిసిపల్‌ మూడో చైర్మన్‌

ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తాం..
13వ సారి జరగనున్న జనగామ మునిసిపల్‌ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాం. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు 30 వార్డుల పరిధిలో 60 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎక్కడ కూడా చిన్న పొరపాటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– నోముల రవీందర్, కమిషనర్, జనగామ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement