
సాక్షి, వరంగల్ రూరల్: మునిసిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ముందస్తుగానే ఆశావహులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మునిసిపాలిటీలున్నాయి. నర్సంపేట మునిసిపాలిటీలో 24 వార్డులు, పరకాలలో 22, వర్ధన్నపేటలో 12 వార్డులున్నాయి. మునిసిపాలిటీ ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మరో పక్క వార్డులకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశా రు. వార్డులపై అభ్యంతరాలు సైతం స్వీకరించారు. ఈ నెల 17న వార్డుల తుది జాబితాను విడుదల చేయనుండడంతో అధికార పార్టీ నాయకులు అప్రమత్తమవుతున్నారు.
గెలుపే లక్ష్యంగా..
జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరవేయాలని ఉద్దేశంతో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నేతలను ఒక్కో వార్డుకు ఇన్‌చార్జిలుగా నియమించారు. ఆయా నాయకులు నిత్యం ఆయా వార్డుల్లోని నాయకులతో సమావేశమవుతున్నారు. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మునిసిపాలిటీల్లో బరిలో నిలిచే వారి ఎంపికలు సైతం ఇన్‌చార్జిలకే అప్పగించారని తెలిసింది. పరకాలలో ఇప్పటికే ఇన్‌చార్జిలు ఆశావహుల్లో ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారని తెలుసుకుంటున్నారు. ఈ ఇన్‌చార్జిలతో ఇప్పటికే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశమై పలు సుచనలు చేశారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని గతంలోనే ప్రకటించారు.
ముందస్తుగానే ప్రచారం
టీఆర్‌ఎస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ముందుగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వాల్ వ్రైటింగ్‌లు, పట్టణాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టికెట్ తనకే వస్తుందని పలకాలని కాలనీల్లో ఆశావహులు ఇంటింటికీ తిరుగుతున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ఏదైనా శుభకార్యం, ఎవరైనా చనిపోయినా వారి ఇంటికి వెళ్లి పలకరిస్తున్నారు. చనిపోయిన కుటుంబా లను స్థానిక ఎమ్మెల్యేలను పరామర్శించేందుకు తీసుకవస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా ఓటర్లకు అందుబాటులోకి వచ్చేందుకు టీఆర్‌ఎస్ తరుఫున బరిలో నిలచేవారు ప్రయత్నిస్తున్నారు.
భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్న నేతలు
రూ 6 నుంచి 12 లక్షల వరకు కౌన్సిలర్ కోసం ఖర్చు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నవారితో పాటు ఇతరులు కూడా పోటీ పడుతున్నారు. శివారు ప్రాంతాలు రియల్ ఎస్టేట్ పెరగడం, కొత్త భవనాలు రావడం, అభివృద్ధికి నిధులు రావడం వల్ల అందరు దృష్టిపెడుతున్నారు. గతంలో సర్పంచ్‌లుగా ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మునిసిపాలిటీల పరిధిలో కౌన్సిలర్ పదవీ కీలకం కావడం, గౌరవం ఉండడం, అభివృద్ధి కోసం నిధులు రావడం, ఆదాయం ఉండడంతో ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
నేతలను కలుస్తూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల కమీషన్ ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించినా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం మునిసిపాలిటీల పరిధిలో రాజకీయం వేడెక్కుతుంది. షెడ్యూల్ ప్రకటిస్తే మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆశావహులు ప్రదక్షిణలు
టీఆర్‌ఎస్ అధికారంలో ఉండడం, స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ వారే కావడంతో టికెట్ వస్తే గెలుస్తామని ఆశావహులు ఊవ్విళ్లూరుతున్నారు. టికెట్ కోసం ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓ పక్క వార్డుల్లో తిరుగుతూనే ఎమ్మెల్యే ఎక్కడ కార్యక్రమం అయితే అక్కడ వాలిపోతున్నారు. ఇలా నిత్యం అశావహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment