ఇల్లు @ ఈజీ
ఇల్లు కట్టిచూడు..పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. కానీ ఇల్లు చాలా విజీ అంటున్నాడు ఓ యువ ఇంజినీర్..తక్కువ వ్యయంతో కొద్ది రోజుల్లోనే కోరుకున్న ఇంటి నిర్మాణం పూర్తిచేయవచ్చని సిస్కాన్ సంస్థ ప్రకటించింది. ఈ టెక్నాలజీతో సామాన్యుడి సొంతింటి కల సులభంగా సాకారమవుతుందని యువ ఇంజినీర్ ధీమాగా ప్రకటిస్తున్నారు. ఇక ఆలస్యమెందుకు..ఆలోచించండి.
కూకట్‌పల్లి: వ్యయాన్ని, సమయాన్ని తగ్గిస్తూ కొత్త టెక్నాలజీతో సులభంగా ఇల్లు కట్టవచ్చని అంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓ యువ ఇంజనీర్. ప్లాస్టిక్ ఫామ్ కన్‌స్ట్రక్షన్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించవచ్చని సిస్కాన్ సంస్థ ప్రకటించింది. కూకట్‌పల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిస్కాన్ ఎండీ లక్ష్మీకాంత్, ఇంజినీర్ లక్ష్మణ్‌రావులు వివరాలు వెల్లడించారు.
హౌజ్ డిజైన్ ప్రకారం ప్లాస్టిక్ ఫామ్స్‌ను అమర్చి అందులో రెడీ మిక్స్ సిమెంట్ కాంక్రీట్‌ను నింపి నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. ఈ విధానాన్ని ప్లాస్టిక్ ఫామ్ టెక్నాలజీగా పిలుస్తారు. గోడలు, బీమ్స్, స్లాబ్ అన్నీ ప్లాస్టిక్ ఫామ్స్‌తోనే కడతారు. అనంతరం ప్లాస్టిక్ ఫామ్స్‌ను సులభంగా తొలగించవచ్చు.
సాంప్రదాయ పద్ధతిలో పోల్చితే నిర్మాణ వ్యయం దాదాపుగా 25 శాతం, సమయం 50 శాతం తగ్గుతుంది. ఈ పద్ధతిలో ఇప్పటికే పలు కమర్షియల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే బలహీన వర్గాల గృహ నిర్మాణానికి మరింత అనువైనదని వారు తెలిపారు. తక్కువ మంది కూలీలు, మెటీరియల్ వృథా లేకుండా మూడు లక్షలతోనే కోరుకున్న విధంగా ఇల్లు కట్టవచ్చని లక్ష్మీకాంత్ తెలిపారు.