సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా వివిధ రకాల విధుల్ని నిర్వర్తిస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వీరి రోజువారీ వేతనాన్ని పెంచుతూ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డులకు కానిస్టేబుళ్లకు ఉన్నట్లే అనేక సౌలభ్యాలు కల్పించారు. మొత్తంగా ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 14 విభాగాల్లో పనిచేస్తున్న 18,800 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారు. గతేడాది డిసెంబర్ 13న ప్రగతి భవన్‌లో జరిగిన హోంగార్డుల సమావేశంలో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చిన విషయం విదితమే. వీటిని అమలులోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం హోంగార్డులకు రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12 వేలు వేతనంగా లభిస్తోంది. ఇకపై రోజుకు రూ.675 చొప్పున నెలకు రూ.20,250 లభించనుంది. ప్రతి ఏడాదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి రూ.వెయ్యి చొప్పున ఈ వేతనం పెరగనుంది. ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రస్తుతం జీతానికి 30 శాతం అదనంగా పొల్యూషన్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇకపై ఆ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డులకూఈ అలవెన్స్ లభించనుంది. కానిస్టేబుళ్లకు ఇస్తున్నట్లు యూనిఫాం అలవెన్స్, ఇద్దరు పిల్లల వరకు మహిళా హోంగార్డులకు ఆరు నెలల మాతృత్వ సెలవు(మెటర్నిటీ లీవ్), పురుష హోంగార్డులకు 15 రోజుల పితృత్వ సెలవు(పెటర్నిటీ లీవ్) అమలులోకి తీసుకువచ్చారు.
భారీ బందోబస్తు విధుల్లో పాల్గొన్నప్పుడు హోంగార్డులకూ కానిస్టేబుళ్ల మాదిరిగా డైట్ చార్జీలుగా పిలిచే బత్తా మంజూరు చేస్తారు. పోలీసు ఆస్పత్రుల్లో హోంగార్డులకూ అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో ఉండగా మరణించే హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చే తక్షణం సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రతి హోంగార్డుకీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పోలీసుల మాదిరిగా హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాజీవ్ త్రివేది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన హోంగార్డుల వేతనం
Published Thu, Feb 1 2018 2:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment