తేనెటీగలు తరుముతుండడంతో పరుగులు తీస్తున్న టీఆర్ఎస్ నేతలు
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
అదేంటోగానీ తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులపై తేనెటీగలు తెగ దాడి చేస్తున్నాయి, మిము వీడబోమంటూ గులాబీ నేతల వెంట బడుతున్నాయి. వారెక్కడికి వెళితే అక్కడ వాలిపోతున్నాయి. అమాత్యులపై అవిభాజ్యమైన అభిమానాన్ని ఒలకబోస్తున్నాయి. అభిమానిస్తున్నాయో, దాడి చేస్తున్నాయో అర్థం కాక గులాబీ నేతలు బిత్తరపోతున్నారు. మధుమక్షిక ముద్దు మాకొద్దు బాబోయ్ అంటూ తుర్రుముంటున్నారు. జుంటీగల బారిన పడకుండా జారుకుంటున్నారు.
సమిష్టితత్వానికి ప్రతీక నిలిచే తేనెటీగలు దాడి చేయడంలోనూ అదే ఫార్ములా ఫాలో అవుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూకుమ్మడిగా అటాక్ చేయడం వాటికి తేనెతో పెట్టిన విద్య. తెలంగాణ తేనెటీగలు దాంతో పాటు మరో రూల్ కూడా పాటిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకులపైనే తమ ప్రతాపం చూపిస్తున్నాయి. బడా నేతలు పాల్గొంటున్న కార్యక్రమాల్లోనే పిలవని పేరంటాల్లా పోటెత్తున్నాయి. నాయకులను పరుగులు పెట్టిస్తున్నాయి.
మొన్నటికి మొన్న కేసీఆర్ కుడి భజం ఈటెల రాజేందర్, సీఎం తనయుడు కేటీఆర్ లను జగిత్యాలలో జుంటీగల దండు జడిపించింది. నిన్నటికి నిన్న ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ బృందాన్ని పరుగులు పెట్టించింది. ఆమధ్య సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లో గడబిడ చేశాయి. కేసీఆర్ రాక కోసం హెలిప్యాడ్ వద్ద వేచి చూస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాలుదువ్వాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తేనెపట్టుల్లోని గదుల్లా లెక్క తెగదు.
దేనికి భయకుండా నిర్భయంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన గులాబీ నేతలను తేనెటీగలు ఠారెత్తిస్తున్నాయి. వారు ఏ కార్యక్రమానికి వెళ్లినా అనుకోని అతిథుల్లా అరుదెంచుతూ హడావుడి చేస్తున్నాయి. కారు పార్టీ నాయకులే వీటిని చంకలో పెట్టుకుని తిరుగుతున్నారా అనే అనుమానానాలు రేకిత్తించేంతగా హనీబీస్ హల్ చల్ చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఎదురెళ్లి స్వాగతం పలుకుతూ పరుగులు పెట్టిస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు కునుకు లేకుండా చేస్తున్న తేనెటీగలకు మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రత్యర్థులు.
-పి. నాగశ్రీనివాసరావు