సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఉద్యాన వర్సిటీని జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. సాధారణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పలు కీలకాంశాలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నెలకోల్పనున్న ఉద్యాన వర్సిటీని గిరిజన జనాభా అధికంగా ఉన్న వెనుకబడిన అశ్వారావుపేటలో ఏర్పాటు చేయాలని కోరారు.
గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగానే జిల్లాలోని ధన్‌బాద్‌లో జాతీయ స్థాయి మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. వెంటనే ఆ దిశలో ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అదే విధంగా బయ్యారంలో ఏర్పాటు చేయనున్న ఉక్కుపరిశ్రమతో పాటు 4000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుపై సెయిల్, ఎన్టీపీసీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.
స్మార్ట్‌సిటీల పేరిట దేశంలో అభివృద్ధి చేయనున్న పట్టణాల జాబితాలో ఖమ్మం, కొత్తగూడెంను చేర్చాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ముంపు కింద జిల్లా నుంచి బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతున్న ఏడు మండలాల గిరిజనుల సంక్షేమం, పునరావాసం కోసం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి, పన్ను మినహాయింపు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు గురించి పొంగులేటి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఉద్యాన వర్శిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలి
Published Fri, Jul 18 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
Advertisement
Advertisement