- ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధి నుంచి తొలగిస్తాం
- మంత్రి డాక్టర్ రాజయ్య హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : నగదు రహిత చికిత్సలకు నిరాకరించే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధి నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత పథకం కింద చికిత్స అందించేందుకు 230 ఆస్పత్రులు ముందుకు రాగా, మరో 12 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయన్నారు.
ప్యాకేజీకన్నా అదనంగా 25శాతం ఇవ్వాలని కోరుతున్నాయన్నారు. అవి నవంబర్ చివరికల్లా నెట్‌వ ర్క్ పరిధి లోకి రాకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం జూబ్లీహిల్స్ ఆరోగ్యశ్రీ కేంద్ర కార్యాలయంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రుల వైఖరి వల్ల ఉద్యోగులకు ఇబ్బంది రాకుండా నవంబర్ 30 వరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు.
జూడాలూ సహనంగా ఉండండి: రాజయ్య
జూనియర్ వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనిడిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. వారు కోరుతున్నట్లు శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికీ సిద్ధమేననీ అయితే కమలనాధన్ కమిటీ మార్గదర్శకాలు రావాలని అప్పటి వరకు సహనంతో ఉండాలని జూడాలకు సూచించారు. ఇప్పటికైనా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఇఓ ధనుంజయ్‌రెడ్డి, డీఎంఈ పుట్టా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.