పౌష్టికాహారం ఎలా?
- అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా కాని బియ్యం
- పౌరసరఫరాల శాఖ నుంచి అరువు తెచ్చుకున్న అధికారులు
- ఈ నెలాఖరు వరకు కోటా రాకుంటే తిప్పలే
- ఐసీడీఎస్ కమిషనర్‌కు లేఖ రాసినా ఫలితం శూన్యం
ఇందూరు : రేషన్ నిలిచిపోవడంతో నిత్యం ఆహారం తీసుకునే పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందని అధికారులు అంటున్నారు. జిల్లాలో పది సీడీపీఓల పరిధిలో మెయిన్, మిని కలిపి 2,711 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పౌష్టికాహారం పేరిట అందించే గుడ్డు, పాలు, ఒక పూట అన్నం కోసం ప్రతి రోజు ఏడు నెలల నుంచి ఆరేళ్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలు వేల సంఖ్యలో వస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రేషన్ బియ్యం, పప్పులు, నూనె తదితర స రుకులను ఒక నెల ముందుగానే కేంద్రాలకు సరఫరా చేస్తుంది.
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు కలిపి నెలకు దాదాపు 2,800 క్విటాళ్ల బియ్యం అవరసమవుతా యి. సెప్టెంబర్ నెలలో 1,180 క్వింటాళ్లు మాత్రమే కోటా విడుదల చేశారు. అది కూడా ఐసీడీఎస్ డెరైక్టరేట్ నుంచి రాలేదు. తమ కోటా వచ్చే వరకూ అరువు ఇవ్వాలని కోరితే పౌరసరఫరాల శాఖ వారు సరఫరా చేశారు. ఇదీ ఈ నెలాఖరు వరకు సరిపోతుంది. ఈ నెల 15 వరకే రావాల్సిన వచ్చే నెల కోటా ఇప్పటికీ రాలేదు. రాకపోతే త రువాత సంగతేమిటని ఆలోచిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, రేషన్ కొరత ప్రభావం గర్భిణులు, బాలింతలు, పిల్లలపై పడనుంది.
లేఖ రాసినా
సెప్టెంబరులో రావలసిన మిగతా కోటా కోసం ఐసీడీఎస్ అధికారులు కమిషనర్‌కు లేఖ రాశారు. అక్టోబర్, నవంబర్ డిసెంబర్ నెలలకు సంబంధించి పూర్తి కోటాను త్వరగా విడుదల చేయాలని కూడా మరో లేఖ ద్వారా కోరారు. కానీ నేటి వరకూ బియ్యం కోటాను జిల్లాకు పంపలేదు. ఆలస్యానికి గల కారణాలేమిటో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.
డెరైక్టరేట్ నుంచి కోటా రాలేదు
సెప్టెంబర్ నెలకు సంబంధించిన బియ్యం కోటాను సరఫరా చేయాలని ఐసీడీఎస్ డెరైక్టరేట్ అధికారులను కోరాం. సగం కోటాను మాత్రమే విడుదల చేసారు. అది కూడా పౌరసరఫరాల శాఖ ద్వారా అరువు తెచ్చుకున్నాం. డెరైక్టరేట్ నుంచి కోటా వస్తే వారి బియ్యాన్ని తిరిగి వారికిస్తాం. పూర్తి స్థాయిలో రేషన్ విడుదల చేయాలని, లేకపోతే అంగన్‌వాడీ కేంద్రాలలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందని కమిషనర్‌కు లేఖ రాశాం. - రాములు, ఐసీడీఎస్ పీడీ