
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) స్థలాల ఆన్‌లైన్ వేలంలో మాదాపూర్‌లోని ప్లాట్లకు ఊహించని ధర పలికింది. కొన్ని స్థలాలు అప్‌సెట్ ధర కంటే రెండు రెట్లు, మూడు రెట్ల ధరలకు అమ్ముడుపోయాయి. మాదాపూర్ సెక్టార్ 1లోని 451 గజాలకు అత్యధికంగా గజానికి రూ.1,52,000లు, మాదాపూర్ సెక్టార్ 3లోని 1,052 గజాలకు అత్యధికంగా గజానికి రూ.1,19,100, చొప్పున బిడ్డర్లు ధరలు కోట్ చేసి సొంతం చేసుకున్నారు. అతి తక్కువగా నల్లగండ్లలోని ఓ ప్లాట్ గజానికి రూ.25,800లకు బిడ్డర్లు దక్కించుకున్నారు. హెచ్‌ఎండీఏ అమ్మకానికి పెట్టిన 211 ప్లాట్ల ఆన్‌లైన్ వేలం ఆదివారం ప్రారంభమయింది. 74 ప్లాట్లకు హెచ్‌ఎండీఏ నిర్ణయించిన నిర్ధారిత ధరకన్నా రెండింతలు, మూడింతలకు ప్లాట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. ఆది, సోమ, మంగళవారం... మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఆన్‌లైన్ వేలంలో తొలిరోజు మియాపూర్‌లో 49 ప్లాట్లు, చందానగర్‌లో ఆరు ప్లాట్లు, మాదాపూర్‌లో రెండు ప్లాట్లు, నల్లగండ్లలో 17 ప్లాట్లు ఈ–వేలం వేశారు. మాదాపూర్‌లో అత్యధికంగా గజానికి 1,52,000లు పలుకగా, చందానగర్‌లోని ఓ ప్లాట్ గజానికి అత్యధికంగా రూ.70 వేలు, మియాపూర్‌లోని మయూరి నగర్ లేఅవుట్‌లో అత్యధికంగా గజానికి రూ.66 వేలు, నల్లగండ్లలో అత్యధికంగా రూ.35 వేలకుపైనే ప్లాట్లను సొంతం చేసుకున్నారు.
మియాపూర్‌లోని దాదాపు 49 స్థలాలకు గజానికి రూ.40వేలకుపైగానే పలకడం విశేషం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ వేలంలో అత్తాపూర్ రెసిడెన్సియల్ లే అవుట్, అత్తాపూర్ ముష్క్ మహల్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్, చందానగర్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్, గోపన్‌పల్లి హుడా టౌన్‌షిప్, మాదాపూర్ సెక్టర్–1, మాదాపూర్ సెక్టర్–3 , మైలార్‌దేవ్ పల్లి మధబన్ రెసిడెన్సియల్ కాలనీ, మియాపూర్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్, నల్లగండ్ల రెసిడెన్సియల్ కాంప్లెక్స్, నెక్నాంపూర్, సరూర్‌నగర్ చిత్ర లే అవుట్, సరూర్‌నగర్ హుడా ఎంప్లాయీస్, సరూర్‌నగర్ రెసిడెన్సియల్, సరూర్‌నగర్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్, షేక్‌పేట హుడా హైట్స్, హుడా ఎంక్లేవ్, జూబ్లీహిల్స్‌లోని నందనగిరి లే అవుట్, తెల్లాపూర్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్, సాహెబ్‌నగర్ కలన్ (వనస్థలిపురం)లలోని హెచ్‌ఎండీఏ ప్లాట్లు ఉన్నాయి. అయితే హెచ్‌ఎండీఏ అనుమతినిచ్చిన పోచారం, అంతారం, దూలపల్లి, మంకల్, మామిడిపల్లి, భువనగిరి, బాచుపల్లి, జాల్ పల్లి, శంకర్ పల్లి, ఘట్కేసర్, అమీన్పూర్ గ్రామాల్లో ప్రైవేట్ లే–అవుట్లలోని 81 గిఫ్ట్ డీడీ ప్లాట్లు కూడా విక్రయానికి ఉంచారు. ఆదివారం నిర్వహించిన 74 ప్లాట్లు ఆన్‌లైన్ వేలంపోను మిగిలిన ప్లాట్లు సోమ, మంగళవారాల్లో ఎంఎస్‌టీసీ లిమిటెడ్ సంస్థ నిర్వహించనుంది. తొలిరోజే ఊహించని రీతిలో కోట్ చేసిన ధరలు మిగిలిన రెండు రోజుల ఆన్‌లైన్ వేలంలోనూ అదే పంథాలో ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజూ ఆన్‌లైన్ వేలం జోరు చూస్తే తాము ఊహించిన రూ.250 కోట్లను మించి రూ.450 కోట్లు రావొచ్చనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అప్‌సెట్ కంటే అధికం...
నల్లగండ్లలో హెచ్‌ఎండీఏ అప్‌సెట్ ధర గజానికి రూ.22 వేలు నిర్ధారిస్తే ఆన్‌లైన్ వేలంలో రూ.25 వేల నుంచి రూ.73 వేల వరకు బిడ్డర్లు దక్కించుకున్నారు. మియాపూర్‌లో అప్‌సెట్ ధర రూ.20 నుంచి రూ.25 వేలు నిర్ధారిస్తే ఆన్‌లైన్ వేలంలో గజానికి రూ.40 వేలకుపైగానే కొనుగోలుదారులు దక్కించుకున్నారు. మాదాపూర్‌లో రూ.30 వేలు అప్‌సెట్ ధర నిర్ణయిస్తే మూడింతలై గజానికి రూ.1,18,000లకుపైగానే అమ్ముడైంది. చందానగర్‌లో అప్‌సెట్ ధర రూ.25 వేలు నిర్ణయిస్తే కొనుగోలుదారులు రూ.52 వేలకుపైగా ధరను కోట్ చేసి దక్కించుకున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసి అమ్మిన ఈ లే అవుట్లలో అప్పుడూ గజానికి రూ.7వేల నుంచి రూ.12వేల వరకు అమ్ముడుపోయినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment