నిజామాబాద్ పట్టణంలోని త్రీటౌన్‌లో మంగళవారం భారీ చోరీ జరిగింది.
నిజామాబాద్ త్రీ టౌన్: నిజామాబాద్ పట్టణంలోని త్రీటౌన్‌లో మంగళవారం భారీ చోరీ జరిగింది. వివరాలు..మహారాష్ట్రకు చెందిన బాబారావు త్రీటౌన్‌లో కొన్ని సంవత్సరాల క్రితమే వలస వచ్చి జీవనం సాగిస్తున్నాడు. అతనికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో ఉన్న తన నాలుగున్నర ఎకరాల పొలాన్ని రూ. 28 లక్షలకు విక్రయించాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌లో లక్ష రూపాయలను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. కాగా, ఫిబ్రవరిలో మిగిలిన రూ.26 లక్షలను తీసుకొని వచ్చి ఇంటిలో భద్రపరిచాడు. అయితే మంగళవారం చూసుకుంటే డబ్బులు కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ప్రస్తుతం వారున్న ఇంటిలో 13 మంది కుటుంబసభ్యులు ఉంటారు. దీంతో దొంగలు వచ్చే అవకాశమే లేదని పోలీసులు భావిస్తున్నారు. కాగా, 15 రోజుల క్రితం వచ్చిన పెద్దల్లుడు ఈ రోజే తిరిగి తన ఊరికి వెళ్లాడు. అతను వెళ్లిన తర్వాత చూసుకుంటే డబ్బు కనిపించడంలేదు. అంతేకాకుండా ధర్మాబాద్‌లోని భూమిని పెద్దళ్లుడే అమ్మించాడు. దీంతో అతనిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో..ఆ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.