
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వందరోజుల దండయాత్ర
భద్రాచలం : జిల్లాల ఆవిర్భావం రోజైన మంగళవారం ఆదివాసీలకు బ్లాక్ డే అని గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య అన్నారు. ఆదివాసీ ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్ర మంగళవారం భద్రాచలం చేరుకుంది. అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదివాసీల ప్రాంతాలను ముక్కలు చేసిందన్నారు.
5వ షెడ్యూల్ పరిధిలో గల ప్రాంతాలపై గవర్నర్‌కే సర్వాధికారాలు ఉంటాయని, కానీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. ఆదివాసీలను విచ్ఛిన్నంచేసే టీఆర్‌ఎస్ ప్రభుత్వ కుట్రకు నిరసనగా ఆదివాసీలంతా ’వంద రోజుల పాటు దండయాత్ర’ చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ వరకూ ఉన్న ఆదివాసీ ప్రాంతాలను కలుపుకొని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆదివాసీ సంఘాల రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి, వట్టం నారాయణ, రమణాల లక్ష్మయ్య, కల్పన, దాసరిశేఖర్, ముద్దా పిచ్చయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.