మోజు తీరాక... వద్దుపొమ్మన్నాడు..
భూపాలపల్లి అర్బన్: ప్రేమించానన్నాడు. పెళ్లికూడా చేసుకున్నాడు. తీరా మోజు తీరాక వద్దుపొమ్మంటున్నాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకొన్న వాడికోసం భార్య, భర్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. వివరాలు.. పట్టణానికి చెందిన పెండెల రవికుమార్ వరంగల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో హన్మకొండ వడ్డేపల్లికి చెందిన మాడుచి చారుశీలతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2016 సెప్టెంబర్ 13న వరంగల్ మ్యూజికల్ గార్డెన్‌లో వివాహం చేసుకున్నారు.
అప్పటి నుంచి వీరిద్దరు కలిసే ఉంటున్నారు. పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్న అనంతరం ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. ఈ విషయం పై పలుమార్లు ఒత్తిడి తెచ్చిన లాభం లేకపోయింది. కాగా.. గత నెల 17 వరకు ఫోన్‌లో మాట్లాడిన రవి అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ఆందోళన చెందిన చారుశీల భర్త గురించి కూపీ లాగగా.. మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ప్రేమించిన వాడికోసం రెండు రోజులుగా పట్టణంలోని రెడ్డికాలనీలోని రవికుమార్ ఇంటి ముందు చారుశీల నిరాహారదీక్షకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు తమ మద్దతు తెలిపాయి.