వేధింపులకు తల్లీకూతురు బలి | Husband harassment Mother and daughter kills | Sakshi
Sakshi News home page

వేధింపులకు తల్లీకూతురు బలి

Published Fri, Jan 30 2015 3:13 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

వేధింపులకు తల్లీకూతురు బలి - Sakshi

వేధింపులకు తల్లీకూతురు బలి

కొడుకు పుట్టలేదని వివాహితకు చిత్రహింసలు
పుట్టింటి నుంచి ఇంటికొస్తే  చంపేస్తామని బెదిరించిన భర్త, అత్త
ఏడాది కూతురు సహా బావిలో దూకి బలవన్మరణం 
ధారూరు మండలం అవుసుపల్లిలో విషాదం
వివరాలు సేకరించిన డీఎస్పీ, తహసీల్దార్

ధారూరు: వేధింపులకు తల్లీకూతురు బలయ్యారు. మగపిల్లాడు పుట్టలేదని భర్త, అత్త చిత్రహింసలకు గురిచెయ్యడంతో ఓ మహిళ తన ఏడాది కూతురుతో సహా బావిలో దూకి తనువు చాలించింది. ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం మండల పరిధిలోని అవుసుపల్లిలో చోటచేసుకుంది. వికారాబాద్ డీ ఎస్పీ స్వామి, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మొల్ల అలిమా(25)ను మండల పరిధిలోని రాళ్లచిట్టెంపల్లి నివాసి గాజుల లాల్ మహ్మద్ 2007లో వివాహం చేసుకున్నాడు. రూ. 30 వేల నగదు, 3 తులాల బంగారం, ఇతర సామగ్రిని అలిమా కుటుంబీకులు కట్నంగా ఇచ్చారు.

లాల్ మహ్మద్ ఓ కిరాణ కొట్టు నడిపిస్తున్నాడు. తరచూ పూనకం ఊగుతూ జనాల నుంచి డబ్బులు లాగుతుంటాడు. దంపతులకు కూతురు ముస్కాన్(5) ఉంది. ఏడాది క్రితం రెండో సంతానంగా నూర్జహాన్(1)పుట్టింది. కొడుకు పుడుతాడని ఆశించిన అలిమా భర్త లాల్ మహ్మద్, అత్త బొగ్దాద్‌బీ తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో వారు అలిమాను వదిలించుకోవాలని భావించారు. తన కొడుకు లాల్ మహ్మద్‌కు రెండో వివాహం చేయాలని బొగ్దాద్‌బీ పథకం వేసింది. 15 రోజులుగా అలిమాను భర్త, అత్తలు వేధిస్తూ కొట్టడం ప్రారంభించారు.

నిత్యం చిత్రహింసలు పెడుతూ ప్రత్యక్ష నరకం చూపించసాగారు. ‘నువ్వు చస్తే నా కొడుకుకు వేరే పెళ్లి చేస్తాను.. అప్పుడు కొడుకు పుడుతాడు.. నువ్వు చావకుంటే మేమే చంపుతాం’ అంటూ అత్త బొగ్దాద్‌బీ బెదిరించింది. ఈ విషయం తెలుసుకున్న అలియా సోదరులు, కుటుంబీకులు వారం రోజుల క్రితం రాళ్లచిట్టెంపల్లికి వెళ్లి పంచాయతీ పెట్టాలని యత్నించారు. వారిని అలియా భర్త, అత్తలు ఇంట్లోకి రానివ్వకపోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. మంగళవారం తిరిగి అలిమాను భర్త, అత్త కలిసి చితకబాదారు. పుట్టిల్లు అయిన అవుసుపల్లిలో తల్లిదండ్రులు, కుటుంబీకులు లేని సమయంలో వదిలేసి వెళ్లారు. తిరిగి రాళ్లచిట్లెంపల్లికి వస్తే చంపేస్తామన్నారు. జీవితంపై విరక్తి చెందిన అలిమా ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకుంది.

ఈక్రమంలో బుధవారం గ్రామ సమీపంలో బావులెక్కడెక్కడ ఉన్నాయోనని వెతికింది. రాత్రి గ్రామంలోని తన మేనమామ దస్తుమియా ఇంట్లో నిద్రించింది. గురువారం ఉదయం 7 గంటల సమయంలో అలిమా బహిర్భూమికి వెళ్తానని తన కూతురు నూర్జహాన్ ఎత్తుకొని బయలుదేరింది. బంధువు సాబేరా అనుమానించి ఆమె వెంట వెళ్లేందుకు యత్నించింది. స్నానం చేస్తాను షాంపూ కావాలని అలిమా ఆమెకు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లింది.అలిమా గ్రామ శివారులోని ఆశయ్య బావికి వెళ్లింది. ముందుగా తన కూతురు నూర్జహాన్‌ను బావిలో తోసేసి అనంతరం తనూ దూకింది. కొద్దిసేపటి తర్వాత సాబెరా అలిమా కోసం గాలించగా బావిలో తల్లీకూతురు విగతజీవులుగా కనిపించారు. స్థానికులు మృతదేహాలు వెలికితీశారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ స్వామి, ధారూరు తహసీల్దార్ విజయ, సీఐ రంగా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

అలిమా శరీరంపై గాయాలు కనిపించాయి. అలిమా పెద్దకూతురు ముస్కాన్ రాళ్లచిట్లెంపల్లిలో ఉండడంతో తను ప్రాణాలతో బయటపడింది. తను చనిపోతే ఏడాది వయసున్న కూతురు నూర్జహాన్ దిక్కులేనిది అవుతుందని భావించిన అలిమా పాపను కూడా తనతో పాటు తీసుకెళ్లిందని మృతురాలి బంధువులు తెలిపారు. కాగా వారం రోజుల క్రితం అత్తింటి వారు అన్నంలో క్రిమిసంహారక మందును కలిపి అలిమాకు తినిపించేందుకు యత్నించగా, రెండు ముద్దలు తిన్న ఆమె వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలైందని మృతురాలి బంధువులు ఆరోపించారు. కాగా అలిమా మతిస్థిమితం కోల్పోయిందని చిత్రీకరించి పలు మాత్రలు కూడా మింగించారన్నారు. ఆమెను గుప్త నిధుల కోసం బలిచ్చేందుకు కూడా యత్నించారని కన్నీటిపర్యంతమయ్యారు.
 
పరారీలో భర్త, అత్త..
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. తల్లీకూతురి ఆత్మహత్యకు కారణమైన లాల్ మహ్మద్, అతడి తల్లి బొగ్దాద్‌బీపై కేసు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని డీఎస్పీ స్వామి పేర్కొన్నారు. ఈమేరకు మోమిన్‌పేట సీఐ రంగా ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు సాగుతుందని తెలిపారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను జెడ్పీటీసీ సభ్యుడు పట్లోళ్ల రాములు సందర్శించి వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement