కరీంనగర్ లీగల్: అదనపు వరకట్నం కోసం భార్యను ఎముకలు విరిగేలా కొట్టిన భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి భవానీచంద్ర బుధవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.బాలకిషన్‌రావు కథనం ప్రకారం.. కరీంనగర్ మండలం మల్కాపూర్‌కు చెందిన కవిత ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని. చింతకుంటకు చెందిన నేర్నాల సురేందర్(30) ఆటోడ్రైవర్. కవితతో పరిచయం పెంచుకున్న సురేందర్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2007 ఏప్రిల్ 26న చిగురుమామిడి మండలం సుందరగిరి ఆలయంలో వీరి వివాహం జరిగింది.
ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న సురేందర్ నిత్య వేధింపులకు గురిచేయ సాగాడు. దీనికితోడు కట్నం కోసం హింసించగా, కవిత తండ్రి రూ.1.10 లక్షలు ఇచ్చాడు. మద్యానికి బానిసై డబ్బులు ఖర్చు చేయడమే కాకుండా కవిత ఒంటిపై ఉన్న నగలను అమ్మేశాడు. ఈ క్రమంలో 2011 అక్టోబర్ 17న మద్యం మత్తులో ఇంటికి సురేందర్ అన్నం పెట్టమని భార్యను అడిగాడు. ఇంట్లో సరుకులు లేవని ఆమె తెలుపడంతో పొయ్యిలో కర్రతో తీవ్రంగా కొట్టాడు. కవితకు ఆరుచోట్ల ఎముకలు విరిగాయి. ఘటనపై అప్పటి మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై దుర్గ కేసు దర్యాప్తు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున సాక్ష్యాలు పరీశీలించిన జడ్జి సురేందర్‌కు జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు.
భార్యను వేధించిన భర్తకు ఐదేళ్ల జైలు
Published Thu, Jan 1 2015 4:45 AM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM
Advertisement