విషసాగరం | Hussensagarlo dose increased pollution elements | Sakshi
Sakshi News home page

విషసాగరం

Published Mon, Sep 29 2014 12:20 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

విషసాగరం - Sakshi

విషసాగరం

  • హుస్సేన్‌సాగర్‌లో పెరిగిన కాలుష్య మూలకాల మోతాదు
  •  గత ఏడాది కంటే అధికం
  •  పడిపోతున్న ఆక్సిజన్ లెవల్స్
  • సనత్‌నగర్: చారిత్రక హుస్సేన్ సాగర్‌లోని జలాలు కాలకూట విషంగా మారుతున్నాయా.. హానికర రసాయనాల మోతాదు గణనీయంగా పెరిగిపోతోందా.. ఆక్సిజన్ స్థాయి భారీగా తగ్గి జీవరాసుల మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందా.. అవుననే అంటున్నాయి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల గణాంకాలు. గత ఏడాదితో పోల్చితే సాగర్ జలాల్లో కాలుష్యం గణనీయంగా పెరిగా యి. వినాయక విగ్రహాల నిమజ్జనం, వర్షాభావం ఇందుకు కారణమని పర్యావరణ శాస్త్రవేతలు అంటున్నారు.
    కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కలు హుస్సేన్‌సాగర్ పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయి.

    గత సంవత్సరం భారీ వర్షాల కారణంగా కాలుష్య మోతాదు తక్కువగా నమోదైంది. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాల గాఢత అధికంగా ఉన్న రంగులతో తయారుచేసిన వినాయక ప్రతిమల నిమజ్జనం కారణంగా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ) స్థాయి అనూహ్యంగా పెరిగిందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఎన్నడూ లేనివిధంగా సాగర జలాల్లో సూక్ష్మజీవుల మనుగడకు అత్యంత ఆవశ్యకమైన నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి (డీవో) దారుణంగా పడిపోయింది.

    సాధారణంగా లీటరు నీటిలో 3 మైక్రోగ్రాము/లీటరు ఉండాల్సిన ఆక్సిజన్ మోతాదు నిమజ్జనం ముందు, నిమజ్జన సమయంలో ఏకంగా 1.3 మైక్రోగ్రాములకు పడిపోవడంతో హుస్సేన్‌సాగర్‌లో జీవరాశుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. వినాయక ప్రతిమలతోపాటు పూజకు వినియోగించిన పత్రి, ఇతర వస్తువులు, ప్లాస్టిక్ వంటి పదార్థాలు సాగర జలాల్లోకి చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది.

    కాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే నిమజ్జన సమయంలో హుస్సేన్‌సాగర్ జలాల పరిస్థితిపై పీసీబీ అధ్యయనం చేసింది. నిమజ్జనానికి ముందు, నిమజ్జన సమయంలో, నిమజ్జనం తరువాత మూడు దశలుగా హుస్సేన్‌సాగర్‌లో పలు పాయింట్ల వద్ద పీసీబీ అధికారులు కాలుష్య మోతాదులను లెక్కించారు. వీరి పర్యవేక్షణలో పలు ఆందోళన కలిగించే వాస్తవాలు వెలుగుచూశాయి.
     
     కాలుష్యం లెక్కించిన కేంద్రాలివే...
     బుద్ధ విగ్రహం వద్ద ఉన్న ప్రధాన పాయింట్‌తో పాటు ఎన్టీఆర్‌పార్కు ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫాం నంబర్-1, ప్లాట్‌ఫాం నంబర్-2, లుంబినీ పార్కు వద్ద, నెక్లెస్ రోడ్డు, లేపాక్షి హ్యాండీ క్రాఫ్ట్ దగ్గర సాగర్ జలాలను మూడు దఫాలుగా సేకరించి వరంగల్‌లోని పీసీబీ ల్యాబ్‌లో పరీక్షించారు.
     
     ఇదిగో సాగరంలో ‘గరళం’
     నిమజ్జన సమయంలో అన్ని అన్ని మానిటరింగ్ స్టేషన్ల వద్ద నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు (టోటల్ డిజాల్వ్‌డ్ సాలిడ్స్ -టీడీఎస్) భారీగా పెరిగాయి. నిమజ్జనానికి ముందు లీటరు నీటిలో అత్యధికంగా టీడీఎస్ 918 మిల్లీ గ్రాములు/లీటరు ఉండగా నిమజ్జనం తరవాత 956కు పెరిగింది. గతేడాదితో పోలిస్తే టీడీఎస్ మోతాదు నిమజ్జనం తరవాత ఏకంగా 154 మిల్లీగ్రాము/లీటరు పెరగడం గమనార్హం.
         
     గాఢత ఉన్న రసాయనాల ఆనవాళ్ల ఉనికిని తెలిపే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ) నిమజ్జనం ముందు లీటరు నీటిలో అత్యధికంగా 96 మిల్లీ.గ్రా ఉంటే నిమజ్జనం సమయంలో 112 మిల్లీ. గ్రాకు చేరింది. సాధారణంగా సాగర్ జలాల్లో సీవోడీ 90 మిల్లీగ్రాములుగా ఉంటుంది. నిమజ్జనం తర్వాత మరో 22 మిల్లీగ్రాము/లీటరు పెరిగినట్లు పీసీబీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సీవోడీ పెరిగిందంటే హానికరమైన రసాయనాలు ఉన్నట్లు సుస్పష్టమౌతోంది. సీవోడీ స్థాయిగతేడాది కంటే 16 మిల్లీగ్రాము/లీటరు పెరిగింది.
         
    బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) విషయానికొస్తే నిమజ్జనం ముందు సరాసరి 52 మీల్లీగ్రాము/లీటరుగా ఉంటే నిమజ్జనం సమయంలో 58కు చేరింది. అత్యధికంగా బుద్ధభవన్ పాయింట్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఇదే పాయింట్ వద్ద 48 ఉండగా అదనంగా 10 మిల్లీగ్రాము/లీటరు చేరినట్లు పెరిగింది.
         
     జీవరాశుల మనుగడకు అత్యంత ఆవశ్యకమైన నీటిలో కరిగిన ఆక్సిజన్ మోతాదు (డీవో) విగ్రహాల నిమజ్జనం ముందు అత్యధికంగా 1.3 మి.గ్రా ఉండగా, నిమజ్జనం తరవాత దాదాపుగా అంతే ఉండడం గమనార్హం.
         
     గత ఏడాదితో పోలిస్తే నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి భారీగా పడిపోయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా డీవో 3 మీల్లీగ్రాము/లీటరుకు తగ్గకూడదు. అలాంటి 1.3కు చేరడాన్ని బట్టి జీవరాశులకు ఏమాత్రం ఆక్సిజన్ అందడం లేదని తెలుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement