జన్యువుల కత్తిరింపు.. మలేరియాకు విరుగుడు!
మలేరియా వ్యాధితో ఏటా లక్షలాది మంది ప్రాణాలను హరించే ప్లాస్మోడియం పరాన్నజీవిని హతమార్చేందుకు శాస్త్రవేత్తలు కొత్త టెక్నిక్‌ను కనుగొన్నారు. ‘సీఆర్‌ఐఎస్‌పీఆర్’ అనే ఈ టెక్నిక్‌తో ప్లాస్మోడియంలో ఏదో ఒక కీలకమైన జన్యువును మార్చడం లేదా కత్తిరించడం ద్వారా దానిని వందశాతం అడ్డుకునేందుకు వీలవుతుందట. ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్ పరాన్నజీవికి చెందిన మొత్తం జన్యుపటాన్ని రూపొందించినా.. ఇప్పటికీ ఆ జన్యుపటంలోని 2,500 జన్యువుల పనితీరును అర్థం చేసుకోవాల్సి ఉందని, అయితే జన్యువులను మార్చే పద్ధతి ద్వారా కొత్త ఔషధాలు కనుగొనేందుకు మార్గం సుగమం అయిందని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా ప్లాస్మోడియం పరాన్నజీవి సంక్రమించినప్పుడు మనిషి ఎర్ర రక్తకణాలు మృదుత్వాన్ని కోల్పోయి గురుకుగా మారతాయి.
దాంతో ప్లాస్మోడియం రక్తకణానికి అతుక్కుని అందులోకి ప్రవేశించి రక్తకణాన్ని తినేస్తుంది. అయితే ఈ రెండు రకాల పనులు చేసేందుకు కార్ప్, ఎబా-175 అనే రెండు జన్యువులే ప్లాస్మోడియానికి ఉపయోగపడుతున్నాయని గుర్తించిన ఎంఐటీ శాస్త్రవేత్తలు.. దానిలోని ఈ జన్యువులను ఆటంకపర్చారు. ఫలితంగా ప్లాస్మోడియం ఎర్ర రక్తకణాలను గరుకుగా మార్చలేక , అందులోకి ప్రవేశించలేకపోయిందట. దీంతో ప్లాస్మోడియం జన్యువులను ఆటంకపర్చే ఔషధాల తయారుచేస్తే దానిని పూర్తిగా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు.