అమీర్‌పేట మెట్రోస్టేషన్లో రద్ధీ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ చివరి గమ్యస్థానం చేరుకునేందుకు ఆపసోపాలు పడుతూనే ఉన్నారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై అధికారులు చెబుతున్న మాటలకు..వాస్తవాలకు పొంతన కుదరడం లేదు. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోలు–రాయదుర్గం రూట్లలో 69.2 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు కారిడార్లలో 57 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. కానీ వీటిలో కేవలం 24 మెట్రో స్టేషన్ల నుంచి మాత్రమే ప్రయాణికులు తమ చివరి గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా షటిల్ సర్వీసులు(మినీ బస్సులు) అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో నిత్యం సుమారు పదివేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే మూడు మెట్రో మార్గాల్లో రోజువారీగా నాలుగు లక్షల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో షటిల్ సరీ్వసులు వినియోగిస్తున్నవారు 3 శాతానికి మించి లేరంటే అతిశయోక్తి కాదు. మిగతా ప్రయాణికుల్లో చాలామంది తమ వ్యక్తిగత వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
మెట్రో ప్రయాణ ఛార్జీకంటే పార్కింగ్ రుసుములు,క్యాబ్‌లు,ఆటోల్లో ప్రయాణ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం స్వీదా సంస్థ 24 మెట్రో స్టేషన్ల నుంచి 45 మార్గాల్లో సుమారు వంద షటిల్ సరీ్వసులను నడుపుతోందని మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఈ సర్వీసులు సైతం ఉదయం 7:30 నుంచి 11:30 గంటలు, సాయంత్రం 5.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరో వైపు ప్రైవేటు సంస్థ కావడంతో తమకు బాగా ప్రయాణికులు, ఛార్జీలు అధికంగా ఉండే మార్గాల్లోనే లాభాపేక్షతో షటిల్స్ నడుపుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. వీటిల్లోనూ కనీస చార్జీ రూ.10, గరిష్టంగా రూ.49 వరకు ఉందని..వీటి చార్జీలు సైతం మెట్రో చార్జీలతో పోటీపడుతుండటం గమనార్హం. దీంతో 24 మినహా ఇతర మెట్రో స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే వారికి లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అనేక వ్యయప్రయాసలకు గురిచేస్తోందని వాపోతున్నారు. తక్షణం అన్ని మెట్రోస్టేషన్ల నుంచి సమీపకాలనీలు,ప్రాంతాలకు షటిల్స్ నడపాలని డిమాండ్ చేస్తున్నారు.
అద్దె సైకిళ్లు..బైక్‌లకు గిరాకీ అరకొరే..
ఇక పలు మెట్రోస్టేషన్ల వద్ద లాస్ట్‌మైల్ కనెక్టివిటీకోసం ఏర్పాటుచేసిన అద్దె బైక్‌లు, కార్లు, సైకిళ్లకు గిరాకీ అంతంత మాత్రంగానే ఉన్నట్లు సుస్పష్టమౌతోంది. వీటి అద్దెలు సైతంఅధికంగా ఉండడం, వాటిని వినియోగించే ప్రక్రియపై సామాన్య ప్రయాణిలకు అంతగా అవగాహన లేకపోవడంతో వీటిని వినియోగించే ప్రయాణికులు సైతం మొత్తం మెట్రో ప్రయాణికుల్లో 3 శాతానికి మించి లేరని తేటతెల్లమౌతోంది.
రైళ్ల ఫ్రీక్వెన్సీ సైతం..
ప్రస్తుతం రద్దీ వేళల్లో ప్రతి ఐదు నిమిషాలకు..రద్దీ లేని సమయాల్లో 8 నుంచి 10 నిమిషాలకో రైలును నడుపుతున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. కానీ పలు సమయాల్లో రైళ్లు 12–15 నిమిషాల కొకటి నడుస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలు, రాత్రి 9 నుంచి 11 గంటల మధ్యన ఈ పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment