ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలంగాణ | Hyderabad Become Popular For Gaming And Technology | Sakshi
Sakshi News home page

ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలంగాణ

Published Thu, Nov 21 2019 3:39 AM | Last Updated on Thu, Nov 21 2019 3:39 AM

Hyderabad Become Popular For Gaming And Technology - Sakshi

ఇండియా జాయ్‌–2019 ప్రారంభోత్సవంలో నమ్రతతో కరచాలనం చేస్తున్న మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: గేమింగ్, టెక్నాలజీ, వినోద రంగాల్లో దక్షిణాసియాకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో గేమింగ్, మీడియా, వినోద రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రదర్శన ‘ఇండియా జాయ్‌ 2019’ను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. ఇంటర్నెట్‌ మాధ్యమంగా టీవీ, సినీ ప్రసారాలను అందించే ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) రంగం ఏటా 8 శాతం చొప్పున శరవేగంగా వృద్ధి చెందుతోందని, ప్రస్తుతం యానిమేషన్‌ విభాగంలో ఓటీటీ వాటా 2.9 బిలియన్‌ డాలర్లుగా ఉందని కేటీఆర్‌ వెల్లడించారు.

విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరిశ్రమ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా దక్షిణాసియాలోని అన్ని భాషల సినీ పరిశ్రమలకు కేంద్రంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని 150కి పైగావీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలు, 2డీ, 3డీ యానిమేషన్, గేమింగ్‌ కంపెనీలు 30 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 90 వేల మందికి పరోక్ష ఉపాధి ఉపాధిని కల్పిస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ల జనాభా ఉండగా, 2.3 బిలియన్ల మంది డిజిటల్‌ గేమింగ్‌లో చురుగ్గా ఉన్నారని, ప్రస్తుతం 140 బిలియన్‌ డాలర్లుగా ఉన్న గేమింగ్‌ మార్కెట్‌లో భారత్‌ వాటా 91 శాతం మేర అనగా 125 బిలయన్‌ డాలర్ల మేర ఉందని కేటీఆర్‌ వెల్లడించారు.

స్మార్ట్‌ఫోన్లు, టాబ్‌లు జీవితంలో అంతర్భాగంగా మారిన నేపథ్యంలో 2020–25 నాటికి గేమిగ్‌రంగం 300 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో దేశంలో ప్రత్యేకించి తెలంగాణలో వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, యానిమేషన్, కంటెంట్‌ క్రియేషన్‌ రంగాల్లో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందన్నారు. తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్రంలో గేమింగ్‌ స్టార్టప్‌లు 25 ఉండగా, ప్రస్తుతం 250కి చేరాయని, ‘ఈ స్పోర్ట్స్‌’రంగంలో భారతీయ కంపెనీలకు అనేక అవకాశాలు వస్తున్నాయని కేటీఆర్‌ చెప్పారు.

2022 నాటికి ఇమేజ్‌ టవర్స్‌
హైదరాబాద్‌లో ఏర్పాటైన గేమింగ్, వీఎఫ్‌ఎక్స్‌ సంస్థల ద్వారా రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, బాహుబలి, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి అత్యున్నత సాంకేతిక సినిమాలు, చోటా బీమ్‌ వంటి యానిమేషన్‌ చిత్రాలకు ఇక్కడే రూపకల్పన జరిగిందని కేటీఆర్‌ చెప్పారు. యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్‌ కంపెనీల కోసం గ్రీన్‌మ్యాట్, మోషన్‌ క్యాప్చర్‌ వంటి అత్యాధునిక స్టూడియోలు.. పూర్తి సదుపాయాలతో కూడిన ఇమేజ్‌ టవర్స్‌ నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుందన్నారు.

రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఉపాధి దక్కేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. యానిమేషన్, గేమింగ్‌ తదితర రంగాలపై అవగాహన కల్పించేందుకు ఫైనార్ట్స్‌ కోర్సులతో పాటు డిగ్రీలోనూ వాటిని పాఠ్యాంశాలుగా చేర్చుతామన్నారు. గేమింగ్‌ రంగంలో స్థానికంగా పెట్టుబడులతో వచ్చే సంస్థలకు రాయితీలు ఇవ్వడంతో పాటు, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. 

23 వరకు ‘ఇండియా జాయ్‌’
బుధవారం ప్రారంభమైన ఇండియా జాయ్‌ 2019 వేదికగా ప్రపంచ డిజిటల్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్పొరేషన్లు ఒకే వేదిక మీదకు వచ్చాయి. ఈ నెల 23 వరకు హెచ్‌ఐసీసీలో జరిగే ఈ ప్రదర్శనకు సుమారు 30 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా. కాగా, ప్రపంచవేదిక మీద తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు భారత్‌కు చెందిన మీడియా, గేమింగ్, డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలకు ఇండియా జాయ్‌ వేదికగా పనిచేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్, గేమింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజీవ్‌ చిలుక, సినీ నిర్మాత అల్లు అరవింద్, అమేజాన్‌ ప్రైమ్‌ కంటెంట్‌ హెడ్‌ విజయ్‌ సుబ్రమణ్యం, సినీ నటి నమ్రత శిరోద్కర్, శ్రీధర్‌ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement