
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్–2018లో రాష్ట్రానికి 4 పురస్కారాలు లభించాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ రాష్ట్ర రాజధాని నగరంగా హైదరాబాద్ ఎంపికైంది. దక్షిణాదిన అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేటకు పురస్కారం దక్కింది. దేశంలోని 4,203 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై సర్వే నిర్వహించి రూపొందించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్–2018’ ర్యాంకులను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ పురి బుధవారం ఢిల్లీలో ప్రకటించారు.
దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్ తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, భోపాల్, చండీగఢ్‌లు రెండు, మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో పలు అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 23 నగరాలకు పురస్కారాలు ప్రకటించగా, ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ రాజధాని నగరం కేటగిరీలో హైదరాబాద్‌కు పురస్కారం వరించింది. లక్ష పైన జనాభా ఉన్న నగరాలు, రాజధాని నగరాలను జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపిక చేయగా, లక్ష లోపు జనాభా ఉన్న నగరాలకు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, ఈశాన్య జోన్ల వారీగా కేంద్రం పురస్కారాలు ప్రకటించింది.
దక్షిణ జోన్ పరిధిలో నాలుగు పట్టణాలకు పురస్కారాలు వరించగా, అందులో మూడు రాష్ట్రానికి సంబంధించినవే కావడం గమనార్హం. దక్షిణ జోన్ పరిధిలో అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేట, పౌరుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం అత్యుత్తుమ సిటీగా బోడుప్పల్, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాల అమల్లో ఉత్తమ నగరంగా పీర్జాదిగూడలు ఎంపికయ్యాయి.