హైదరాబాద్‌ను వైఫై సిటీగా మార్చేస్తాం
సైబర్ సెక్యూరిటీ సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : భాగ్యనగరాన్ని దేశంలోనే మొట్టమొదటి వైఫై సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, నగరంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో శుక్రవారం కాన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన సైబర్ సెక్యూరిటీ సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమన్నారు. దేశం, ఐటీ ఇండస్ట్రీ సైబర్ నేరాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి వాటి నివారణకు సమష్టిగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్, సీఐఐ ఛైర్మన్ సురేష్ ఆర్ చిత్తూరి, వైస్ ఛైర్మన్ వనిత, స్కోప్ ఇంటర్నేషన్ ఉపాధ్యక్షులు అకయ్య జనగరాజ్, డీఆర్‌డీఓ జాయింట్ డెరైక్టర్ అమిత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
‘అవుట్‌సోర్సింగ్’ క్రమబద్ధీకరణపై కమిటీ
రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘాన్నిగానీ, అధికారుల కమిటీనిగానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సర్వీసుల క్రమబద్దీకరణతోపాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు శ్యామలయ్య మంత్రిని కోరారు. ఎనిమిదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నామని, వయోపరిమితి దాటడంతో ఇతర ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలో బదిలీలకు అవకాశం ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు.