మహానగరంలో పరీక్ష! | Hyderabad election campaign for district leaders | Sakshi
Sakshi News home page

మహానగరంలో పరీక్ష!

Published Wed, Jan 20 2016 1:52 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM

Hyderabad election campaign for district leaders

హైదరాబాద్ ఎన్నికల్లో జిల్లా నేతల ప్రచారం
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులకు బాధ్యతలు
ఫలితాల ఆధారంగా రాజకీయ భవిష్యత్తు
 

వరంగల్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మెజారిటీ డివిజన్లలో గెలుపు లక్ష్యంగా రెండు ప్రధాన పార్టీలు మన జిల్లా నేతలకు కీలక బాధ్యతలను అప్పగించాయి. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల జిల్లా నాయకులు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు డివిజన్లలో ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమకు అప్పగించిన డివిజన్లలో తమ పార్టీని గెలిపించుకోవడం ఇప్పుడు జిల్లా నేతలకు పరీక్షగా మారింది. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జిల్లా నాయకులు రాజధానిలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో కీలకమైన  ఎన్నికలు జరిగిన ప్రతీసారి జిల్లా నేతలు.. ఆ ఎన్నికల్లో బాధ్యతలు చేపడుతున్నారు.  

హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో బాధ్యతలు తీసుకున్న టీఆర్‌ఎస్ నేతలకు గెలు పు అంశం కీలకం కానుంది. టీఆర్‌ఎస్‌కు ఆవిర్భావం నుంచి అంతగా పట్టులేని హైదరాబాద్‌లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. తమకు కేటాయించిన డివిజన్లలో పార్టీని గెలిపిస్తే.. త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యం ఉండనుంది. భవిష్యత్ రాజకీయ అవకాశాల విషయంలోనూ గ్రేటర్ హైదరాబాద్‌లో తమ పనితీరు ప్రాతిపదిక అవుతుందని టీఆర్‌ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో తమకు కేటాయించిన డివిజన్లలో పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రచార బాధ్యతల్లో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో కొందరు పూర్తిగా అక్కడే ఉంటుండగా.. మరికొందరు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ... జిల్లాలో స్థానిక కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటున్నారు. ఇదిలావుండగా.. కాంగ్రెస్ జిల్లా నేతలు హైదరాబాద్ ఎన్నికల ప్రచార బాధ్యతల విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయడంలేదు. మరో రెండుమూడు రోజుల్లో ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి మల్లాపూర్ డివిజన్ ప్రచార బాధ్యతలను టీఆర్‌ఎస్ అధిష్టానం అప్పగించింది. కడియం శ్రీహరి ఇప్పటి వరకు ఒకేరోజు డివిజన్‌లో పర్యటించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. టీఆర్‌ఎస్ గ్రేటర్ వరంగల్ అ ధ్యక్షుడు నన్నపునేని నరేందర్ ఈ డివిజన్‌లో ప్రచా ర బాధ్యతలను చూస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మే యర్ పదవి విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ నుంచి హామీ పొందిన నన్నపునేని నరేందర్.. రాజ ధానిలో పార్టీ గెలుపు కోసం పూర్తిగా అక్కడే ఉండి ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 22 తర్వాత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ డివిజన్‌లో పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నారు.
     
జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ చర్లపల్లి డివిజన్‌లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ జగద్గిరిగుట్ట, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాదాపూర్ డివిజన్‌లలో ప్రచారం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌లు ఏఎస్‌రావునగర్ డివిజన్‌లో ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
     
ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు-వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖలు మీర్‌పేట డివిజన్‌లో, డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్-మంగల్‌హాట్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య-నాచారం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్-చిలుకానగర్, జనగామ ఎమ్మెల్యే ఎం.యాదగిరిరెడ్డి-కాప్రా, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్-ముషీరాబాద్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-రామంతాపూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్-బోలక్‌పూర్, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు-దత్తాత్రేయనగర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి-హబ్సిగూడ డివిజన్లలో ప్రచార బాధ్యతలు చేపట్టారు.
     
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు-నల్లకుంట, మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి-అక్బర్‌బాగ్, టీఆర్‌ఎస్ యూత్ మాజీ అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు- తలాబ్‌చంచలం, టీఆర్‌ఎస్‌వీ నేత వాసుదేవరెడ్డి- చావని, మైనారిటీ విభాగం నేత ఎం.డి.నయీముద్దీన్- ఝాన్సీబజార్, ఎం.శోభన్‌బాబు-పురానాపూల్, ఆర్.పరమేశ్వర్- గౌలిపుర డివిజన్లకు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.కవిత మంగల్‌హాట్‌లో, టీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి చర్లపల్లి డివిజన్‌లో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.
     
కాంగ్రెస్‌లో ముగ్గురు నలుగురు నేతలకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున ప్రచార బాధ్యతలను అప్పగించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్- బహదూర్‌పుర, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి-గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మరో నలుగురు నేతలతో కలిసి ప్రచార చేస్తున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ పి.బలరాంనాయక్, మాజీ మంత్రి జి.విజయరామారావు- కుత్బుల్లాపూర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య-ఉప్పల్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య-మహేశ్వరం, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి- మలక్‌పేట, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు-కంటోన్మెంట్, హరిరమాదేవి-ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార బాధ్యతలను పీసీసీ అప్పగించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement