‘ఫాస్ట్’ను ఎలా సమర్థిస్తారు?
- 1956 కటాఫ్ రాజ్యాంగబద్ధమేనా?
- తెలంగాణ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పేరుతో రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించిన జీవో 36లోని అంశాల సహేతుకతను ప్రశ్నించింది. 1956 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ణయించడాన్ని ఎలా సమర్థించుకుంటారంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని నిలదీసింది. 1956 నవంబర్ 1 నాటికి తెలంగాణలో స్థిరపడిన కుటుంబాల విద్యార్థులకే ఫాస్ట్ పథకాన్ని వర్తింపజేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కోర్టు సోమవారం తీవ్రంగా స్పందించింది.
‘బిహార్‌కు చెందిన దంపతులు రాష్ట్రానికి వచ్చి స్థిరపడితే, వారి బిడ్డకు ఫాస్ట్ కింద సాయం చేయరా? అతను రాజ్యాంగ పరిధిలోకి రాడా? జాతి సమగ్రత కింద అతనికి చదవుకునే అవకాశం లేదా?’ అంటూ ప్రశ్నలు సంధించింది. ఈ మొత్తం వ్యవహారంలో కోర్టుకు పూర్తి స్పష్టతనివ్వాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ విధానాలు రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని తేల్చి చెప్పింది.
ఈ వ్యాజ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటివరకూ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానంతో ఆటలాడుకోబోదని ఆశిస్తున్నామంటూ ఏజీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, ఈ విషయంలో మీ మోహం చూసి మరో అవకాశం ఇస్తున్నామంటూ ఏజీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్ జీవోను సవాలు చేస్తూ ఆచంట టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ఇవి సోమవారం మరోసారి ధర్మాసనం ముందుకు వచ్చాయి. పితాని సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.
ఫాస్ట్ జీవోకు సంబంధించి విధివిధానాలను, మార్గదర్శకాలను రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏజీ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి విధానం రూపొందించనందున ఈ వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఓ విధానం రూపొందించి, మార్గదర్శకాలను అమలు చేసినప్పుడు పిటిషనర్లు కోర్టుకు రావచ్చునని సూచించారు. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా మార్గదర్శకాలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఈ దశలోనే కోర్టును ఆశ్రయించడం సరికాదని వివరించారు.
అడ్వొకేట్ జనరల్‌గా తన వాదనను రికార్డ్ చేసుకుని, ఈ వ్యాజ్యాలను మూసివేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలోనే జీవోలోని ఓ భాగాన్ని ఆయన చదవి వినిపించారు. ఇదే సమయంలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుంబాలకే ఫాస్ట్‌ను వర్తించే నిబంధనను పిటిషనర్ తరఫు లాయర్ లేవనెత్తారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు గతంలో ఆదేశించినా తెలంగాణ సర్కారు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఏజీని నిలదీసింది. ఆర్థిక సాయానికి కటాఫ్ తేదీ పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో నాలుగు వారాల గడువునివ్వాలని రామకృష్ణారెడ్డి కోరారు. అయితే రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తేల్చి చెబుతూ విచారణను కోర్టు వాయిదా వేసింది.