‘సర్వే’కు నోటిఫికేషన్ జారీ
-
నమ్మకమైన డేటాబేస్ కోసం నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడి
-
ఇళ్లకు నంబర్, ప్రభుత్వ స్టిక్కర్
-
రుజువులు చూపిస్తే విదేశాల్లో ఉన్నవారి పేర్లూ నమోదు
-
ఉద్యోగుల కుటుంబాలు ఉత్తర్వుల కాపీ చూపిస్తే చాలు
-
పిల్లలు వేరే ప్రాంతాల్లో చదువుతూ ఉంటే ఆ రుజువులు చూపాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా 19న నిర్వహించనున్న ‘సమగ్ర ఇంటింటి సర్వే’కు సంబంధించి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయడానికి వీలుగా, ఆ పథకాలు కేవలం అర్హులకు మాత్రమే అందించడానికి నమ్మకమైన డేటాబేస్ కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్వేకు సంబంధించి కలెక్టర్లకు ఇదివరకే మార్గదర్శకాలు జారీ చేయడంతోపాటు, ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. సర్వేను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించినట్లు తెలిపారు.
రంగంలో 3.69 లక్షల మంది సిబ్బంది
‘సమగ్ర ఇంటింటి సర్వే’ చేసిన అనంతరం ఇళ్లపై సర్వే పత్రం నంబర్‌తో పాటు, తెలంగాణ ప్రభుత్వ స్టిక్కర్‌ను అంటిస్తారు. తెలంగాణవ్యాప్తంగా ఒకే రోజు సర్వే చేయడానికి వీలుగా మొత్తం 3.69 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే ఉత్తర్వుల కాపీని వారు తమ కుటుంబసభ్యులకు ఇవ్వాలని... సర్వే కోసం వచ్చే ఎన్యుమరేటర్లకు ఆ కాపీని చూపిస్తే సరిపోతుందని అధికారవర్గాలు వివరించాయి. కాగా ఇప్పటికే తెలంగాణలో ఇళ్లకు నంబర్లు కేటాయించారు. అధికారులు నోషనల్‌గా కేటాయించిన నంబర్ల ప్రకారం దాదాపు కోటి ఇళ్లు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 19వ తేదీన ఉదయం ఏడున్నర గంటల వరకు ఎన్యుమరేటర్లను గ్రామాలకు పంపిస్తారు. గ్రామాన్ని సెక్టార్లుగా విభజించి, ఒక్కో సెక్టార్‌లో ఉన్న ఇళ్ల నంబర్లను వారికి అందిస్తారు. ఒక్కో ఉద్యోగి 25 ఇళ్ల వరకు సర్వే చేయాల్సి ఉంటుంది. తమ పిల్లలెవరైనా ఇతర ప్రాంతాల్లో చదువుతుంటే తల్లిదండ్రులు అందుకు సంబంధించిన రుజువులను ఎన్యుమరేటర్లకు చూపించాలి. ఆ రుజువుల ఆధారంగా వారు చదువుతున్న విద్యా సంస్థ పేరును, ప్రాంతాన్ని నమోదు చేసుకుంటారు. అలాగే విదేశాల్లో ఉన్న వారి పేర్లను కూడా ఇక్కడ నమోదు చేసుకుంటారు. అందుకు సంబంధించి విదేశాల్లో ఉన్నవారి రుజువులు చూపించాల్సి ఉంటుంది. కాగా సర్వే అనంతరం ఫారాలన్నిటినీ మండల కేంద్రాలకు చేరవేస్తారు. అనంతరం మండలాల వారీగా కంప్యూటరీకరిస్తారు. ఇందుకు ఒక్కో జిల్లాకు మూడు వందల కంప్యూటర్లు కావాల్సి ఉంటుందని అధికారుల అంచనా. ఈ మేరకు దాదాపు పదివేల మందికి పైగా డేటా ఎంట్రీ ఆపరేటర్లతో... సర్వే పూర్తయిన పక్షం రోజుల్లోగా పూర్తి వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయనున్నారు.
కేంద్రం నుంచి లేఖ అందలేదు
‘సర్వే’పై కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి లేఖలు అందలేదని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ చెప్పారు. సర్వేపై కొన్ని పార్టీలు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయడం, కేంద్రం దీనిపై ఆరా తీస్తోందంటూ వచ్చిన వార్తలపై రేమండ్ పీటర్‌ను సంప్రదించగా.. అలాంటిదేమి లేదని ఆయన స్పష్టం చేశారు.