సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన ఓ మహిళ ఇల్లిల్లూ తిరిగి కూరగాయలు విక్రయిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆమె కరోనా బారిన పడింది. స్వల్ప లక్షణాలే ఉండడంతో డాక్టర్లు ఇంట్లోనే ఉండి మందులు వాడుతూ జాగ్రత్తలు పాటించామన్నారు. వాస్తవానికి ఆమె 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. నెగెటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత బయటకు రావాలి. కానీ కూరగాయల అమ్మకమే ఆమె జీవనాధారం కావడంతో వారం రోజుల తిరగకముందే బయటకు వచ్చేసింది.
♦ రామంతాపూర్‌కు చెందిన ఓ యువకుడికి పది రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. అయితే శాంపిల్స్‌తీసుకున్న నాలుగు రోజులకు అతనికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు చెప్పారు.ఆ నాలుగు రోజుల పాటు అతడు అనేక చోట్లకు వెళ్లాడు. ఎంతోమందిని కలిశాడు. ఈ క్రమంలోనే అతడి భార్యకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తెలిసింది.మందులు, పాలు, కూరగాయల కోసం దంపతుల్లో ఎవరో ఒకరు బయటకు రావాల్సిందే. అలా అతడు హోంక్వారంటైన్‌లో ఉంటూనే తరచు బయటకు వచ్చి వెళ్తున్నాడు.
ఆరోగ్యసేతులో హెచ్చరికలు
మొబైల్ ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్ ఓపెన్ చేస్తే చాలు ప్రమాద ఘంటికలు మోగుతాయి. పాజిటివ్ బాధితులు తారసపడుతూనే ఉంటారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న కరోనా కేసులను గుర్తించేందుకు ఎరుపు రంగు హెచ్చరికలతో ‘ మైల్డ్’ ‘మోడరేట్’ వంటి సంకేతాలు వెలువడుతాయి. ఒకవైపు రోజుకు రోజుకు వేలాది మంది వైరస్ బారిన పడుతుండగా, నిర్ధారణ అయిన వారు నిబంధనలు పాటించకుండా తిరిగి రోడ్డెక్కడం వల్ల వైరస్ ఉధృతి పెరుగుతున్నట్టు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కరుఇద్దరు కాదు, వేలాది మంది పాజిటివ్ బాధితులు ఏదో ఒక కారణంతో హోంక్వారంటైన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చేవారు కొందరైతే, తమను ఎవరూ గుర్తించడం లేదని మరి కొందరు, ప్రభుత్వ పాజిటివ్ లెక్కల్లో తాములేమనే ధైర్యంతో ఇంకొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఈ తరహా ఉల్లంఘనుల్లో ఉండడం విశేషం. మరోవైపు కొద్దిపాటి లక్షణాలతో నాలుగైదు రోజుల్లో కోలుకున్న వారు కూడా హోంక్వారంటైన్ ఉండకుండా బయటకు రావడం గమనార్హం.
లెక్కలు వేలల్లోనే....
జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 16,600 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. మరో 12,500 మందికి పైగా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 29 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కానీ ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకున్నవారు, ఈ గణాంకాల్లోకి రానివారు రెట్టింపు సంఖ్యలోనే ఉన్నారు. వీరిపైన ఎలాంటి నియంత్రణ లేదు. హోం ఐసోలేషన్ నిబంధనలు అమలు కావడం లేదు. దీంతో వైరస్ విజృంభణకు మార్గం సుగమమవుతోంది. పరీక్షలు చేసుకొన్న వాళ్ల సంఖ్యే ఇలా వేలల్లో ఉండగా, వైరస్ బారిన పడ్డప్పటికీ ఎలాంటి పరీక్షలకు వెళ్లనివారు ఇంకా రెట్టింపు సంఖ్యలోనే ఉన్నట్టు అంచనా.
హోంక్వారంటైన్ ముద్ర లేకపోవడమేనా...
లాక్‌డౌన్ సమయంలో, ఆ తర్వాత కొద్ది రోజుల పాటు కరోనా లక్షణాలు ఉన్న వాళ్లకు గుర్తింపు కోసం చేతికి ‘హోంక్వారంటైన్’ ముద్ర వేసి ఇళ్లకు పంపించారు. దీనివల్ల కచ్చితమైన నిఘా కొనసాగింది. ప్రస్తుతం ఈ క్వారంటైన్ ముద్ర వేయడం లేదు. దీంతో ఒంట్లో వైరస్ ఉన్న వాళ్లు సాధారణ జనంలో కలిసిపోతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో నిర్ధారణ అయిన వాళ్లు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, మరి కొందరు అసలు పరీక్షలకే వెళ్లకుండా, ముప్పు ముంచుకొచ్చే వరకు గుట్టుగా ఉంటూ గుంపులో కలిసిపోతున్నారు.
భరోసా అవసరమే
కరోనా బాధితుల కోసం ప్రభుత్వం వివిధ రకాల సేవలు, ఉచిత వైద్య సలహాలు, సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వాస్తవానికి అంతంత మాత్రంగానే సేవలు అందుతున్నాయనే ఆరోపణలు ఓవైపు ఉండగా, హోంక్వారంటైన్ వల్ల పరువు పోతుందేమోనని వెనుకడుగు వేస్తున్న వారూ మరికొందరు ఉన్నారు. అలాంటి వారికి ప్రభుత్వమే అండగా ఉండాలి. భరోసా ఇవ్వాలి.
ఈ సేవలను వినియోగించుకోండి..
కోవిడ్ కాల్ సెంటర్ : 18005994455
టెలీమెడిసిన్ : 180059912345
ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లపై ఫిర్యాదు కోసం : 9154170960
Comments
Please login to add a commentAdd a comment