బీబీకాఆలం ఊరేగింపు (ఫైల్)
సాక్షి సిటీబ్యూరో: చరిత్రలో మొహర్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముస్లింలు నూతన సంవత్సరం ప్రారంభ మాసంగా మొహర్రంను పరిగణిస్తారు. పూర్వం నుంచే ఈ విధానం ఉంది. మహ్మద్ ప్రవక్త కూడా ఇదే విధానాన్ని అమలులో ఉంచారు. అసలు మహ్మద్ ప్రవక్త సమాజానికి, విశ్వాసాలకు ఉపకరించే ఏ పాత పద్ధతులనూ మార్చలేదు. సమాజ వికాసానికి దోహదపడే విధానాలు, పద్ధతులను స్వయంగా ఆచరించారు.
పవిత్ర దినం...
ఇస్లామియా చరిత్రలో మొహర్రం మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మొహర్రం మాసం పదో తేదీని ఆషూరా అంటారు. చరిత్రలో ఈ తేదీకి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఆదిమానవుడైన ఆదం ఆలైహిస్సలాంను దైవం సృష్టించింది, స్వర్గానికి పంపించింది ఆషూరా రోజునే. నోవా (నూహ్) ప్రవక్త నావను కనివిని ఎరగని భయంకర తుఫాన్ నుంచి రక్షించి, దైవం ఒడ్డుకు చేర్చింది ఈరోజే. యూనుస్ ప్రవక్తను చేప కడుపు నుంచి రక్షించింది కూడా ఈ రోజే. ఇబ్రహీంను నమ్రూద్ రాజు అగ్నిగుండంలో పడేసినప్పుడు దైవం ఆయన్ని అగ్ని నుంచి కాపాడాడు. మోషే ప్రవక్త, అనుయాయులను అష్టకష్టాలకు గురిచేసిన రాజు ఫిరోన్’(ఫారో) బారి నుంచి రక్షించాడు. దీనికి కృతజ్ఞతగా మోజెస్ ప్రవక్త అనుయాయులు (యాదులు) ఆ రోజు ఉపవాసం ఉండేవారు. మహ్మద్ ప్రవక్త రెండు రోజులు ఉపవాసం పాటించాలని బోధించారు. అంటే 9, 10వ తేదీల్లో గానీ 10, 11వ తేదీల్లో గానీ ఉపవాస వ్రతం పాటించాలి. ఆ ఆషూరా ఉపవాసాలకు రంజాన్‌న్‌ఉపవాసాల తరువాత స్థానం ఇచ్చారు మహ్మద్ ప్రవక్త(స). ఈ రెండు ఉపవాసాలు పాటించిన వారి గత పాపాలన్నీ దైవం క్షమిస్తాడు. మహ్మద్ ప్రవక్త(స) బోధనలతో ముస్లింలంతా పునీతులయ్యారు.
ప్రజాస్వామ్యమే పరమావధి...
మహ్మద్ ప్రవక్త పరమపదించిన తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకున్నారు. అటువంటి ప్రజాప్రతినిధిని ఖలీఫా అని పిలుస్తారు. మొట్టమొదటిసారిగా ఖలీఫాగా హజ్రత్ సిద్ధిఖ్æ ఎన్నికయ్యారు. ఆయన తరువాత వరుసగా హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వీరి పాలనా కాలంలో న్యాయం నాలుగుపాదాలపై నడిచింది. ఆర్థిక, ధార్మిక, రాజకీయ పరిపాలన రంగాలన్నింటిలోనూ సమతూకం నెలకొని ఉండేది. ప్రజలందరికీ ఎలాంటి వ్యత్యాసాలు, తారతమ్యాలు లేకుండా సమాన న్యాయం, గౌరవ మర్యాదలు లభించేవి. అందుకే వీరి పరిపాలన కాలం ప్రపంచ మానవ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంగా పేరొందింది.
అధికార దాహం...
నాలుగో ఖలీఫా హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమామే హసన్‌ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్‌గా ఉన్న హజ్రత్ మావియా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల సలహా మేరకు అధికారం కోసం పోటీపడ్డారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య యుద్ధం వచ్చింది. కానీ ఇరువైపులా కరవాలాలు చేతపట్టిన అమాయక సొదర ప్రజానీకాన్ని చూసి ఇమామే హసన్ మనసు చలించిపోయింది. వెంటనే రణరంగం నుంచి నిష్క్రమించి ప్రజలు కట్టబెట్టిన రాజ్యాధికారాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా మావియా మనుసులో నాటుకున్న రాజ్యకాంక్ష అనే విషబీజం పెరిగి పెద్దదై అధికార వ్యామోహంతో తన కొడుకు యజీద్‌ను రాజుగా గుర్తించమని ప్రజలపై ఒత్తిడి తెచ్చారు. రాజ్యంలో అలజడులు, హింసాకాండ చెలరేగాయి. ప్రజలు భయంతో యజీద్‌ను రాజుగా గుర్తించారు. ఈ విధంగా ప్రజాస్వామ్యానికి పెద్దదెబ్బ తగిలింది. ప్రజాస్వామ్యవాదులకు ఈ పరిణామం ఏ మాత్రం రుచించలేదు. వారు రాచరికానికి ఎదురు తిరిగారు.
ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత ఇమామే హసన్ భుజస్కంధాలపై మోపారు. ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం ఏ సమస్యకైనా చర్చలు, సంప్రదింపులే పరిష్కార మార్గాలు. అందుకని ఇమామే హసన్ ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ముఖాముఖి చర్చల కోసమని ఇమామ్ రాజధాని కుఫాకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న యజీద్ ఇమామ్ రాజధానికి చేరితే తన అధికారానికే ముప్పు వస్తుందని గ్రహించి ఆయన్ని అడ్డుకోవడానికి ఓ పెద్ద సైన్యాన్ని పంపాడు. మార్గ మధ్యలో కర్బలా అనే చోట యజీద్ సైన్యం ఇమామ్ పరివారాన్ని అడ్డగించి యజీద్‌ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి ఇమామే హసన్‌ను హెచ్చరించాడు. తాను కేవలం చర్చల కోసమే రాజధానికి వెళుతున్నానని, దయచేసి తనను అడ్డగించవద్దని ఇమామే సెన్యాధికారిని కోరాడు. కానీ సైన్యాధిపతి ఇమామ్ మాటల్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా యజీద్‌ను రాజుగా గుర్తించడమో, లేక యుద్ధమో తేల్చుకోమన్నాడు. ఆశయసాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే కాని.. దౌర్జన్యం ముందు తలవంచనన్నారు ఇమామే హసన్.
ఆయనతో పాటు 72 మంది అమరులయ్యారు. షియా ముస్లింలు మొహర్రం మాసం మొదటి 10 రోజులు వీరి జ్ఞాపకార్థం మాతంగా పాటిస్తారు. మొహర్రం 10వ రోజు పెద్ద ఎత్తున ముస్లింలు తమ రక్తాన్ని చిందించి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల పాలనా కాలం నుంచి నేటికీ రాష్ట్ర ప్రభుత్వం బీబీకా ఆలం ఊరేగింపును నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 400 ఏళ్ల నుంచి ఏ దేశంలో, రాష్ట్రంలో లేని విధంగా బీబీకా ఆలం ఊరేగింపు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తోంది.
ఊరేగింపునకు బల్దియా ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: మొహర్రంను పురస్కరించుకొని చారిత్రాత్మక బీబీకా అలవా నుంచి శుక్రవారం జరిగే ఊరేగింపునకు వివిధ విభాగాల ద్వారా తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఊరేగింపు కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దాదాపు రూ.3 కోట్లతో రోడ్ల మరమ్మతులు, అదనపు లైటింగ్, నూతన రోడ్ల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. బీబీకా ఆలం ఊరేగింపు మార్గంతో పాటు అన్ని అషూర్‌ఖానాల మార్గంలో రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం తదితర పనులతో పాటు అదనంగా 95 మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఊరేగింపు మార్గంలో భవన నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా తొలగించామని చెప్పారు. బీబీకా ఆలం నుంచి చాదర్‌ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో జలమండలి ద్వారా నాలుగున్నర లక్షల మంచినీటి ప్యాకెట్ల పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment