ఆకాశ పుష్పం! | Hyderabad People Celebrating Sravana Masam | Sakshi
Sakshi News home page

ఆకాశ పుష్పం!

Aug 9 2019 12:04 PM | Updated on Aug 15 2019 1:34 PM

Hyderabad People Celebrating Sravana Masam - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: శ్రావణమాసం.. సౌభాగ్యానికి, లక్ష్మీకటాక్షానికి నిదర్శనం. గృహాలన్నీ నిత్య పూజలతో శోభాయమానంతో దర్శనమిస్తుంటాయి. మహిళలు ఉపవాసాలు, ఆలయాల  దర్శనం, భక్తిప్రపత్తులతో ఉంటారు. ఈ క్రమంలో శ్రావణ శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. దీంతో ఒకరోజు ముందునుంచే వరలక్ష్మి వ్రతానికి అవసరమయ్యే పూజా సామగ్రిని సిద్ధం చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. పూల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా వరలక్ష్మీ పూజకు ప్రత్యేకంగా వినియోగించే కమలం పూల ధరలను వ్యాపారులు భారీగా పెంచారు. కమలం పూల జత రూ.150 వరకు పలికింది. అరటి కొమ్మలు జత రూ. 80 నుంచి రూ.120 వరకు విక్రయించారు. ఇతర పూల ధరలు సాధారణ రోజుల్లో కంటే రెట్టింపయ్యాయి. శ్రావణ మాసం డిమాండ్‌కు తోడు.. ఇతర రాష్ట్రాల నుంచి పూల దిగుమతులు పెద్దగా రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని హోల్‌సెల్‌ వ్యాపారులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం పూల ధరలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పూల తోటలకు నష్టం వాటిల్లడం ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు.

పూల సరఫరా తగ్గింది..  
వర్షాలతో రంగారెడ్డి, వికారాబాద్, మెదక్‌ తదితర జిల్లాల నుంచి వచ్చే పూలు భారీగా తగ్గాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా చిక్‌బల్లాపూర్‌ నుంచే ఎక్కువగా వివిధ రకాల పూలు మార్కెట్‌కు వస్తున్నాయి. దూరప్రాంతాల నుంచి పూలు దిగుమతులు కావడంతో కూడా ధరలు పెరిగాయి. – కె.శ్రీధర్, స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement