కరోనా వైరస్ గ్రేటర్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకు సగటున 30 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలకు జనం నిర్లక్ష్యమే కారణంగా చెప్పొచ్చు. ఏమాత్రం భయం లేకుండా కొంతమంది విచ్చలవిడిగా విందులు, వినోదాలకు తెరతీయడంతోనే కోవిడ్ ముప్పు పెరిగింది. వనస్థలిపురం, మలక్‌పేట్, తాజాగా పహడీషరీఫ్ ఉదంతాలే ఇందుకు నిదర్శనం. లాక్‌డౌన్ సడలింపులను ఆసరాగా చేసుకుని పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి రావడం, భౌతిక దూరం, మాస్కులు ధరించడం మర్చిపోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ త్వరగా విస్తరిస్తోంది. మార్చి మాసంలో 64 పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఏప్రిల్‌లో 537, మేలో మంగళవారం వరకు 712 కరోనా కేసులు నమోదవడం గమనించాల్సిన అంశం. (గుమిగూడితే.. చెప్పేస్తుంది)
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చాపకింది నీరులా విస్తరిస్తున్న వైరస్ ఇప్పటికే 200కిపైగా కుటుంబాలను చుట్టేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1991 పాజిటివ్ కేసులు నమోదు కాగా... గ్రేటర్ హైదరాబాద్‌లోనే 1313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 57 మంది మృతి చెందగా.. వీరిలో 50 మంది సిటిజనులే. కేవలం 26 రోజుల్లో 29 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు రోజుకు సగటున 30 పాజిటివ్ కేసులు నమోదవుతుండగా..మరో వైపు సిటిజన్లు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. చాలా మంది ముఖానికి మాస్క్ ధరించడం లేదు. (ఏమరుపాటు వద్దు!)
భౌతికదూరం పాటించక పోగా, పుట్టిన రోజులు, ఇతర వేడుకల పేరుతో పెద్ద సంఖ్యలో ఒకే చోట చేరుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరించి కుటుంబ సభ్యులతో పాటు మొత్తం బంధు వర్గమే..అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. వనస్థలిపురం, మలక్‌పేట్, తాజాగా పహడీషరీఫ్ ఉదంతాలే ఇందుకు నిదర్శనం. కేవలం ఈ మూడు వేడుకల్లోనే వంద మందికి వైరస్ సోకడం విశేషం. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేసింది. ఈ సమయంలో వైరస్ తగ్గినట్లే తగ్గి..ఆంక్షల సడలింపుతో ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తుంది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా నగరంలో బుధవారం మరికొన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో నాలుగు అనుమానిత కేసులు నమోదయ్యాయి.
ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కొత్తగా పది మంది అనుమానితులు అడ్మిటయ్యారు. వీరి నుంచి స్వాబ్స్ సేకరించి, పరీక్షలకు పంపారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన 17 మందిని డిశ్చార్జి చేశారు. ఆయుర్వేద ఆస్పత్రిలో 19 మంది అనుమానితులు ఉన్నారు. వీరి రిపోర్టులు కూడా రావాల్సి ఉంది. ఇక కింగ్‌కోఠి ఆస్పత్రిలో 84 మంది అనుమానితులు ఉన్నారు. వీరి రిపోర్ట్‌లు కూడా రావాల్సి ఉంది.
ముంబై నుంచి వచ్చిన యువతికి పాజిటివ్
హఫీజ్‌పేట్ : ఇటీవల ముంబై నుంచి వచ్చిన యువతికి (18) కరోనా పాజిటివ్ వచ్చింది. మియాపూర్‌లోని టీఎన్‌నగర్‌కు చెందిన కుటుంబం మూడేళ్ల క్రితం కూలీ పనుల కోసం ముంబై వెళ్లింది. లాక్‌డౌన్ సడలించడంతో ఈ నెల 23న నగరానికి తిరిగివచ్చారు. స్థానికుల సమాచారంతో అధికారులు సదరు కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా యువతికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె తల్లిదండ్రులను వైద్య పరీక్షల కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. టీఎన్ నగర్‌ను కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
ముషీరాబాద్‌లో ఇద్దరికి పాజిటివ్
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో బుధవారం మరో రెండు పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. భోలక్‌పూర్ డివిజన్, గుల్షన్‌నగర్‌కు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నారాయణగూడలో టైలర్‌షాపు నిర్వహిస్తూ బాగ్‌లింగంపల్లి ఎల్‌ఐజీ క్వార్టర్స్‌లో ఉంటున్న వ్యక్తి(56) కూడా కరోనా బారిన పడటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
గోషామహల్‌లో మరో ఇద్దరికి..
అబిడ్స్: గోషామహాల్ జీహెచ్‌ఎంసీ 14వ సర్కిల్ పరిధిలో బుధవారం మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గంగాబౌలికి చెందిన కళాకారుడు (52)కి పాజిటివ్ రావడంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులు 10 మందిని హోం క్వారంటైన్ చేశారు. టక్కర్‌వాడికి చెందిన వ్యక్తి (56)కు కరోనా బారిన పడటంతో అతడి కుటుంబసభ్యులు 9 మందిని హోం క్వారంటైన్ చేశారు.
కరోనాతో వృద్ధురాలి మృతి
స్వచ్ఛందంగా హోం క్వారంటైన్‌లో 50 కుటుంబాలు
అల్వాల్: కరోనాతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. అదిలాబాద్‌కు చెందిన వృద్ధురాలు (65) కాలికి చికిత్స చేయించుకునేందుకుగాను కొద్ది రోజుల క్రితం అల్వాల్ పాకాలకుంటలో ఉంటున్న కుమారుడి ఇంటికి వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న 50 కుటుంబాలు స్వచ్ఛందంగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.
కింగ్‌కోఠి ఆసుపత్రిలో మరొకరు..
సుల్తాన్‌బజార్: కరోనాతో బాధపడుతూ బుధవారంఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..చందానగర్‌కు చెదిన వ్యక్తి(57) గత కొంతకాలంగా హైపర్‌టెన్షన్, బీపీతో బాధపడుతున్నాడు. కొద్ది రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న అతను మంగళవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నలుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్
కరోనా వైరస్ జిల్లాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మహమ్మారి.. జిల్లా అంతటా విస్తరిస్తోంది. నందిగామ, రాజేంద్రనగర్, బాలాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించిన కరోనా.. ప్రస్తుతం షాద్‌నగర్, శంకర్‌పల్లి, మొయినాబాద్, మహేశ్వరం ప్రాంతాల్లో పంజా విసురుతోంది. బుధవారం మరో 9 కొత్త కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న నలుగురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరు నార్సింగి, మదీనాగూడ, మణికొండ, శంకర్‌పల్లికి చెందినవారు. మిగిలిన ఐదుగురిలో మొయినాబాద్, మణికొండ, మియాపూర్‌కు చెందిన వారు ఒకరుచొప్పున ఉండగా ఇద్దరు షాద్‌నగర్ వాసులు. ఈ నేపథ్యంలో గచ్చిబౌళిలోని సైబరాబాద్ కమిషనరేట్‌ను శానిటైజ్ చేశారు. కమిసనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment