సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ లేకుండా బైకులు నడుపుతున్న వారిపై సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించారు. నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 60శాతం మంది హెల్మెట్ లేకపోవడంతోనే గాయపడుతున్నారని గణాంకాలు చెబుతుండడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ఏడాదిలో జూలై వరకు 12,96,580 మంది వాహనదారులకు చలాన్‌లు వేశారు. మొత్తం రూ.12,92,09,600 జరిమానా విధించారు. తనిఖీలు చేస్తున్నా, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా హెల్మెట్ ధరించకుండా వెళ్లేవారు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తుండడంతో రెండు కమిషనరేట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేక బృందాల్లోని పోలీసులు విద్యాసంస్థలు, ట్రాఫిక్ జంక్షన్లు, ప్రధాన మార్గాల్లో ఉండి హెల్మెట్ ధరించని ఫొటోలు కెమెరాల్లో బంధించి ఈ–చలాన్‌లు ఇంటికి పంపుతున్నారు.
కొన్నిసార్లు స్పాట్‌లోనే పట్టుకొని జరిమానాలు విధించడంతో పాటు రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో ఉల్లంఘన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే విషయాలను వీడియో ప్రజంటేషన్ ద్వారా చూపిస్తున్నారు. రెండోసారి కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు శిక్షణ కేంద్రం ఎస్సై ధ్రువీకరించాకే వారి వాహనాలను తిరిగి ఇస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతూ మైనర్లు చిక్కితే వాహనాలను స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మరోసారి ద్విచక్ర వాహనాన్ని నడపనివ్వమంటూ లిఖిత పూర్వకంగా రాయించుకుంటున్నారు.
నేరమని తెలిసీ...
ద్విచక్ర వాహనదారుల్లో కొందరు హెల్మెట్‌లు ధరించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. బైక్ నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మోటార్ వాహన చట్టం ప్రకారం నేరం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీటన్నింటిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఉల్లంఘనకు జరిమానాతో పాటు పాయింట్లు ఖాతాలోకి వెళ్తాయని, వీటి ద్వారా జైలు శిక్షలు పడతాయంటూ హెచ్చరిస్తున్నారు. ఉల్లంఘనులకు సంబంధించి తాము పట్టుకున్న ప్రతి వాహనం వివరాలను రవాణా శాఖ సర్వర్‌లోని రికార్డులకు అనుసంధానిస్తున్నామని వివరిస్తున్నారు.
ఇప్పటికే 10 పాయింట్లు దాటేసిన వారి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. 12 పాయింట్లు చేరుకున్నాక వారి డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దవుతుందని, అలాగే జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిని ట్రాఫిక్ పోలీసుల దగ్గరున్న ట్యాబ్ ద్వారా గుర్తిస్తున్నారు. లైసెన్స్ నంబర్ నమోదు చేస్తే వాహన చోదకుల చరిత్ర తెరపై కనిపిస్తుందని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. తద్వారా తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ఇరు కమిషనరేట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు విజయ్‌కుమార్, దివ్యచరణ్ తెలిపారు.
చలాన్‌లు ఇలా... (జనవరి–జూలై)
కమిషనరేట్ | చలాన్‌లు | జరిమానా(రూ.ల్లో) |
సైబరాబాద్ | 8,42,653 | 8,38,35,600 |
రాచకొండ | 4,53,927 | 4,53,74,000 |
Comments
Please login to add a commentAdd a comment