1984 పోలీస్‌ స్టోరీ! | Hyderabad Police Stations Special Story | Sakshi
Sakshi News home page

1984 పోలీస్‌ స్టోరీ!

Published Thu, Aug 8 2019 11:18 AM | Last Updated on Sat, Aug 10 2019 9:43 AM

Hyderabad Police Stations Special Story - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఓ కుటుంబం తమ నివాసం కోసం పదేళ్ల క్రితం 300 గజాల్లో విశాలమైన గదులతో ఇల్లు కట్టుకుంది. ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో పాటు ఇల్లు విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉన్న దాంట్లోనే గదుల సంఖ్య పెంచుతూ అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటోంది. ఫలితంగా గదులు ఇరుకుగా మారిపోయి అందులో ఉండేందుకు ఇబ్బంది పడేపరిస్థితులు తలెత్తాయి. 

ప్రస్తుతం నగర పోలీస్‌ వ్యవస్థలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. దాదాపు 35 ఏళ్ల క్రితం.. అప్పుడున్నపరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా అప్పటికి ఉన్న ఠాణాలను పునర్వవస్థీకరిస్తూ 60 శాంతిభద్రతల విభాగం పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లలో సిటీలో జనాభా పెరగడంతో పాటు అనేక మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఠాణాల సంఖ్య మాత్రం ఏమాత్రం పెరగలేదు... సిబ్బందీ పెంపులేదు.ఫలితంగా ఉన్న స్టేషన్లపై భారీగా పని ఒత్తిడి పెరింగింది.  

రాజధాని నగరం భౌగోళికంగా కలిసే ఉన్నా పోలీసు పరిధులకు సంబంధించి ఇందులో మూడు కమిషనరేట్లు ఉన్నాయి. మధ్య భాగంలో హైదరాబాద్‌ కమిషనరేట్, పశ్చిమాన సైబరాబాద్, తూర్పున రాచకొండ విస్తరించి ఉన్నాయి. మిగిలిన రెండు కమిషనరేట్లు విస్తరిస్తున్నప్పటికీ ప్రధాన సిటీకి మాత్రం ఆ అవకాశం లేదు. అయితే, కోర్‌ సిటీ కావడంతో జనాభా పెరుగుదల, విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడేవారి తాకిడి ఎక్కువగానే ఉంటోంది. దీనికి తగ్గట్టే నేరాలతో పాటు కేసులూ పెరుగుతున్నాయి. వీటన్నింటికీ మించి బోనాలు, బక్రీద్, గణేష్‌ ఉత్సవాలు వంటి మతపరమైన ఘట్టాలతో పాటు అసెంబ్లీ, వివిధ రకాలైన సభలు, సమావేశాలు ఇవన్నీ ఇక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. వీటిన్నింటి నేపథ్యంలో ప్రతి పోలీస్‌ అధికారి ఏడాదిలో కనీసం 100 నుంచి 150 రోజులు వివిధ రకాలైన బందోబస్తు విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. వీటన్నింటికీ మించి ప్రముఖుల రాకపోకలు సైతం హైదరాబాద్‌లో ఎక్కువగానే ఉంటాయి.  

ఆ రెండింటిలోనే కాస్త బెటర్‌
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ప్రాముఖ్యతతో పాటు పురాతన చరిత్ర గల హైదరాబాద్‌ కమిషనరేట్‌ పునర్వవస్థీకరణపై మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. దాదాపు పదిహేడేళ్ల క్రితం ఏర్పాటైన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మైలార్‌దేవ్‌పల్లి, బాచుపల్లి వంటి ఠాణాలు, దీని నుంచి విడిపోయి.. 2016లో రూపు సంతరించుకున్న రాచకొండలో ఆదిభట్ల, అబ్దుల్లాపూర్‌మెట్‌ వంటి పోలీసుస్టేషన్లు కొత్తగా పుట్టుకువచ్చాయి. అయితే, దశాబ్దాల చరిత్ర గల హైదరాబాద్‌ కమిషనరేట్‌లో మాత్రం జనాభా పెరుగుతున్నా, పోలీసింగ్‌ రూపురేఖలు మారుతున్నా, నానాటికీ కేసుల నమోదు అధికమవుతున్నా, బందోబస్తు–భద్రత విధుల భారం మోయలేకున్నా రీ ఆర్గనైజేషన్‌ మాత్రం జరగట్లేదు. కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఉండే హైదరాబాద్‌ ఈ కోణంలో మిగిలిన రెండు కమిషనరేట్ల కంటే ఎంతో కీలకమైన.. ముఖ్యమైన వ్యవస్థ. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న ఈ పోలీస్‌ కమిషనరేట్‌పై దాదాపు అన్ని నగరాల కళ్లు ఉంటాయి. నిత్యం ఇక్కడి పరిణామాలను వారు పరిశీలిస్తుంటారు.  

కేటగిరీలుగా విభజించిందీ అప్పట్లోనే
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్లలో 1984లో ఆఖరుసారి పోలీస్‌ స్టేషన్ల పునర్వవస్థీకరణ జరిగింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం నాటి పరిస్థితుల ఆధారంగా దీన్ని చేపడతూ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ఠాణాలను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఈ ప్రాంతం పంజగుట్ట స్టేషన్‌కు ఔట్‌పోస్టుగా ఉండేది. ప్రస్తుతం ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఔట్‌పోస్టుగా కొనసాగుతున్న బోరబండకు ప్రత్యేక ఠాణా కావాలనే డిమాండ్‌ దాదాపు 20 ఏళ్లుగా ఉంది.  దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అనేకసార్లు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపినా అమలుకు మాత్రం నోచుకోలేదు. పరిపాలన సౌలభ్యంతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో నగరంలోని పోలీస్‌ స్టేషన్లను మూడు కేటగిరీలుగా విభజించారు. దాని పరిధిలో నేరాల నమోదు, నివసిస్తున్న జనాభా తదితరాలను పరిగణలోకి తీసుకుని 35 ఏళ్ల క్రితం ఈ విభజన చేశారు. దీని ప్రకారం ‘ఎ’ కేటగిరీ పోలీస్‌ స్టేషన్‌లో 120కి పైన, ‘బి’ కేటగిరీలో 90 నుంచి 100 మధ్య, ‘సి’ కేటగిరీలో 60 నుంచి 80 మధ్య సిబ్బంది ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి కనీసం ఈ కేటగిరీలను కూడా పునర్వవస్థీకరించలేదు.

అప్పటి ప్రాధాన్యాలతోనే ఇప్పటికీ..
నగరంలో అప్పట్లో ఉన్న ప్రాధన్యం ప్రకారం ఠాణాల రూపకల్పన, అందులో సిబ్బంది కేటాయింపు జరిగింది. అప్పట్లో ముఖ్యమంత్రి నివాసం ఉన్న నేపథ్యంలో అబిడ్స్, సుల్తాన్‌బజార్‌ ఠాణాలను పెద్దవిగా భావించారు. దానికి తగ్గట్టే సిబ్బందిని కూడా కేటాయించారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. మరోపక్క ఆనాటి కమ్యూనల్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కామాటిపురా, కాలాపత్తర్, శాలిబండతో పాటు షాహినాయత్‌గంజ్, బేగంబజార్‌ ఠాణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, సైదాబాద్, చిలకలగూడలు చిన్న స్టేషన్ల కంటే చాలా పెద్దవి. అయినప్పటికీ చిన్న ఠాణాల కంటే కేవలం 20 శాతం సిబ్బంది మాత్రమే ఇక్కడ అధికంగా ఉంటారు.

‘ట్రాఫిక్‌’ పరిస్థితులే కాస్త బెటర్‌
సాధారణంగా శాంతిభద్రతల విభాగం ఠాణాల కంటే ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కేవలం 10 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లే ఉండేవి. వీటి సంఖ్యని దాదాపు 20 ఏళ్ల క్రితం 18కి పెంచారు. అప్పటి నుంచి నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతునే ఉన్నా స్టేషన్లను మాత్రం పెంచడం లేదు. అయితే, 2012లో అప్పటి ప్రభుత్వం నగరానికి అదనంగా 33 శాతం పోస్టులు కేటాయించింది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న అప్పటి ట్రాఫిక్‌ విభాగం అదనపు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఏడు కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, నల్లకుంట, ఫలక్‌నుమా, నారాయణగూడ, మారేడ్‌పల్లి, టోలిచౌకి ట్రాఫిక్‌ ఠాణాలు అప్పుడే అందుబాటులోకి వచ్చాయి. నగర వ్యాప్తంగా ఉన్న 18 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధులు, వాటిలో ఉండే ప్రాంతాలు, అక్కడ జరిగే కార్యకలాపాలను అధ్యయనం చేసిన సీవీ ఆనంద్‌.. అందుకు తగ్గట్టు రీ ఆర్గనైజ్‌ చేసి కొందరు అధికారులపై పడే మితిమీరిన భారాన్ని తగ్గించారు.   

పునర్‌ విభజన చేయాల్సిందే..
ప్రస్తుతం నగరంలోని శాంతిభద్రతల విభాగం ఠాణాలను పునర్‌ వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. కేవలం పరిధిని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా దాంతో పాటు ఆయా ఠాణాలు/ప్రాంతాల్లో నమోదయ్యే నేరాలు, నివసిస్తున్న/వచ్చిపోతున్న జనాభా, బందోబస్తు విధులను పరిగణలోకి తీసుకుంటూ పోలీస్‌ స్టేషన్ల రీ ఆర్గనైజ్‌ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందనే భావన ఉందని, అయితే.. అది సరికాదని వారు పేర్కొంటున్నారు. ఉన్న పోస్టులనే సర్దుబాటు చేస్తూ ఠాణాలను విభజించినా కొంత వరకు ఒత్తిడి తగ్గించవచ్చని, ఆపై అవకాశం ఉన్నప్పుడు వాటికి కొత్త పోస్టులు కేటాయించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం నగర పోలీస్‌ కమిషనరేట్‌లోని స్టేషన్లను పునర్విభజన చేపట్టాలని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement