జాలీగా.. సెల్ఫీగా.. | Hyderabad Public First Day Metro Train Journey Experience | Sakshi
Sakshi News home page

తొలి పయనం

Published Thu, Nov 30 2017 9:30 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

Hyderabad Public First Day Metro Train Journey Experience - Sakshi

మెట్రో తొలి పయనం సిటీజనులను ఆనందాశ్చర్యాలకు గురి చేస్తూనే... సమస్యలతో స్వాగతం పలికింది. చాలా స్టేషన్లలో పార్కింగ్‌ వసతి లేకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. నిబంధనలు
తెలియక చాలా మంది తికమక పడ్డారు. సిబ్బంది జరిమానాలు విధించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి మెట్రో తొలి జర్నీ నగరవాసులకు తీపి, చేదు రుచి చూపించింది. ‘సాక్షి’ బుధవారం మెట్రో స్టేషన్లలో విజిట్‌ నిర్వహించగా కొన్ని సమస్యలు కనిపించాయి. ప్రధానంగా పార్కింగ్, టాయిలెట్లు, టికెట్ల కొనుగోలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.    

మెట్రో తొలి జర్నీకి జనం పోటెత్తారు.
నాగోల్‌–అమీర్‌పేట్, అమీర్‌పేట్‌–మియాపూర్‌ మార్గాల్లోని స్టేషన్లన్నీ ప్రయాణికులతో బుధవారం కిక్కిరిశాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ తొలి పయనానికి తరలొచ్చారు. సెల్ఫీలు దిగుతూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు.   

పార్కింగ్‌ ప్రభో...  
నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక స్టేషన్లలో పార్కింగ్‌ సమస్య ప్రధానంగా ఉంది. ఈ స్టేషన్లలో ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉండగా... కార్లు, బస్సులు, క్యాబ్స్‌ నిలిపేందుకు స్థలం లేదు.  
నాగోల్‌ స్టేషన్‌కు చేరుకోవాలంటే బస్‌ దిగి దాదాపు కిలోమీటర్‌ నడవాల్సిందే.  
స్టేషన్‌ స్టేడియానికి రావాలంటే బస్‌ దిగి అర కిలోమీటర్‌ వెళ్లాల్సిందే. ఇక్కడ ఫుట్‌పాత్‌ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  
ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్‌లో పనులు ఇంకా కొనసాగుతున్నాయి.  
హబ్సిగూడ నుంచి తార్నాక వెళ్లే మార్గంలో పార్కింగ్‌ సౌకర్యం లేదు. ఇక్కడ ఫుట్‌పాత్‌ కూడా లేదు. దీంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.  

పరేడ్‌ గ్రౌండ్‌.. పార్కింగ్‌ లేదు   
విశాలమైన స్థలంలో నిర్మించిన స్టేషన్‌ ఇది. సికింద్రాబాద్‌లోని అన్ని స్టేషన్లలో ఇదే మెరుగైనది. కానీ పార్కింగ్‌ స్థలం మాత్రం లేదు.  
ఇక మెట్టుగూడ స్టేషన్‌లో కార్లు, క్యాబ్‌లు నిలిపేందుకు వీలులేదు. ఫుట్‌పాత్‌ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  
సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రో స్టేషన్‌ ఇరుకైన ప్రదేశంలో ఉంది.
సమీపంలో ఎలాంటి వాహనాలు నిలిపేందుకు వీలులేదు. పాత గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ స్థలంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లుఅధికారులు పేర్కొంటున్నారు.  

తొలిరోజే వడ్డన..  
తొలి ప్రయాణంలోనే సిటీజనులకు చేదు అనుభవం ఎదురైంది. నాగోల్‌ స్టేషన్‌లో కొందరు స్నేహితులు అరగంట కంటే ఎక్కువ సేపు ఉన్నందుకు ఒక్కొక్కరికి రూ.50 జరిమానా విధించారు.  
ఓ వ్యక్తి తార్నాక నుంచి బేగంపేట్‌కు ప్రయాణం చేశాడు. అయితే బేగంపేట్‌లో దిగాల్సింది.. అమీర్‌పేట్‌లో దిగాడు. దీంతో స్టేషన్‌ దాటి వచ్చినందుకు ఆయనకు జరిమానా వేశారు.  

ప్రారంభ స్టేషన్‌ పరిస్థితి ఇదీ..  
మియాపూర్‌ మెట్రో ప్రారంభ స్టేషన్‌. కానీ ఇక్కడ ఒకే ఒక టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  
టికెట్‌ తీసుకోవడానికే 45 నిమిషాలు లైన్‌లో నిల్చొవాల్సి వచ్చింది.  
మెట్రో యాప్, స్మార్ట్‌కార్డు, స్వైప్‌ మెషిన్లు త్వరితగతిన పనిచేయకపోవడం సమస్యగా మారింది.
కాయిన్స్‌ వినియోగం తెలియక ప్రయాణికులు తికమక పడ్డారు.  

కొనసాగుతూ...
మూసాపేట్, భరత్‌నగర్, ఎర్రగడ్డ స్టేషన్లలో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫుట్‌పాత్‌ పనులు పూర్తి కాలేదు.  
ఫుట్‌పాత్‌ పనులతో మూసాపేట్‌ స్టేషన్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నిల్చొవడానికి స్థలం లేకపోవడంతో ప్రధాన రహదారిపైనే వేచి ఉన్నారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.   
భరత్‌నగర్‌ స్టేషన్‌లో లిఫ్టు దగ్గరికి వెళ్లేందుకు దారి ఏమాత్రం బాగాలేదు. వృద్ధులు, వికలాంగులు, మహిళలకు తిప్పలు తప్పలేదు. అపరిశుభ్రంగా ఉంది. డస్ట్‌బిన్లు ఎక్కడా కనిపించలేదు.   
ఎర్రగడ్డ స్టేషన్‌లో పార్కింగ్‌కు ఇబ్బందులున్నాయి. ఇక్కడ టికెట్‌ వెండింగ్‌ మెషీన్‌లో క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ఆప్షన్‌ పనిచేయకపోవడంతో ప్రయాణికులు వెనుదిరిగారు.   

అమీర్‌పేట్‌లోనూ అంతే...  
అమీర్‌పేట్‌ ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌. ఇక్కడ తొలిరోజు ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. కానీ పార్కింగ్‌ స్థలం లేదు. దీనికి చాలీస్‌ కమాన్‌ స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, అమల్లోకి రాలేదు. దీంతో స్టేషన్‌ కింది భాగంలో వాహనాలను అస్తవ్యస్తంగా పార్క్‌ చేశారు.  
ఇక బేగంపేట్, ప్రకాశ్‌నగర్‌ స్టేషన్లలో ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

10 వేల స్మార్ట్‌ కార్డులు

తొలిరోజే 10 వేల మెట్రో స్మార్ట్‌ కార్డులను విక్రయించినట్లు ఎల్‌అండ్‌టీ సంస్థ తెలిపింది. నాగోల్‌–అమీర్‌పేట్, అమీర్‌పేట్‌–మియాపూర్‌ మార్గాల్లో బుధవారం మొత్తం 14 రైళ్లను 360 ట్రిప్పులు నడిపామని, దాదాపు 2లక్షల మంది ప్రయాణించారని పేర్కొంది. కాగా మెట్రో జర్నీకి వినియోగించే టోకెన్‌లు ఒకే రోజుకు  పనిచేస్తాయని, నిర్దేశిత గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత వాటిని ఎగ్జిట్‌ గేట్‌ వద్ద వదిలి వెళ్లాలని సూచించింది. మళ్లీ ప్రయాణానికి అన్‌పెయిడ్‌ ఏరియాకు చేరుకొని, తిరిగి టోకెన్‌ కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ప్లాట్‌ఫామ్‌పై పసుపురంగు గీత దాటి ముందుకు రావద్దని హెచ్చరించింది.  

హ్యాపీ.. హ్యాపీ  
మెట్రోలో ప్రయాణించినందుకు ఫుల్‌ హ్యాపీగా ఉన్నాం. మా ఆనందం, అనుభూతిని మాటల్లో చెప్పలేం. అమీర్‌పేట్‌ నుంచి నాగోల్‌ వరకు ప్రయాణించాం. చాలా బాగా అనిపించింది.– సెయింట్‌ జాన్స్‌ స్కూల్‌ విద్యార్థులు  

ఫుల్‌.. థ్రిల్‌
మెట్రో పయనం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. తొలి జర్నీ చేయాలని ఫ్యామిలీతో కలిసి వచ్చాను. ఇందులో ప్రయాణం చాలా బాగుంది. ట్రాఫిక్, కాలుష్యం లేకుండా హాయిగా ప్రయాణించొచ్చు. నగరాభివృద్ధికి మెట్రో ఒక అవకాశం.   – ధనుంజయ, తార్నాక    

చార్జీలు అధికం..
మెట్రో చార్జీలు అధికంగా ఉన్నాయి. సామాన్య ప్రజలు ఈ భారాన్ని మోయలేరు. అమీర్‌పేట్‌ నుంచి నాగోల్‌ వరకు రూ.45 చెల్లించాను. టికెట్‌ ధరల విషయంలో అధికారులు మరోసారి ఆలోచించాలి.  
– రమ్య, ఇంజినీరింగ్‌ విద్యార్థి

జర్నీ సూపర్‌..
మెట్రో జర్నీ బాగుంది. మాది గుజరాత్‌లోని వాద్‌నగర్‌. చింతల్‌లో స్థిరపడ్డాం. ప్రధాని మోదీ ప్రారంభించిన మెట్రో రైలులో తొలిరోజు ప్రయాణించాలని ఎంతో ఉత్సాహంతో వచ్చాం. మెట్రో ప్రయాణం మాకెంతో సంతృప్తినిచ్చింది.   – గుజరాతీలు

పార్కింగ్‌ ఏదీ?  
మెట్రో వసతులు చాలా బాగున్నాయి. కానీ పార్కింగ్‌నే అసలు సమస్య. మెట్టుగూడ, సికింద్రాబాద్‌ ఈస్ట్‌ స్టేషన్లలో కనీసం బైక్‌లకు కూడా పార్కింగ్‌ లేదు. ఇక కార్లు, క్యాబ్‌లలో వస్తే దూరంగా దిగి రావాల్సిందే. పార్కింగ్‌ వసతులు కల్పించాలి.      – బాలశేఖర్, ప్రయాణికుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement