యాదాద్రి దేవాలయం ఆధునీకరణతో భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్, రాయగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల అమ్మకాలు గత రెండేళ్ల కాలంగా జోరందుకున్నాయి. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి అక్కడి రియల్ రంగం కుదేలైంది. రోజూ వందల సంఖ్యలో జరిగే క్రయ విక్రయాలు ఇప్పుడు పదుల సంఖ్యకు తగ్గిపోయాయి.
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక మాంద్యం.. ఈ రంగాన్ని కుదిపేస్తోంది. గత మూడు, నాలుగు నెలలుగా ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు నిలిచిపోవ డంతో రియల్ వ్యాపారులు బెంబేలెత్తు తుండగా.. ఈ రంగాన్నే నమ్ముకున్న ఏజెంట్లు ఆదాయం లేక అల్లాడుతు న్నారు. ఔటర్ రింగు రోడ్లు లోపల, బయటా, రీజనల్ రింగ్ రోడ్డు ప్రతి పాదిత ప్రాంతాలు, ఖరీదైన నగర శివా ర్లుగా పేరొందిన మాదాపూర్, గచ్చి బౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి, కోకా పేట తదితర ఏరియాలూ మాంద్యం కుదుపునకు గురయ్యాయి. బ్రాండెడ్ కంపెనీలు సైతం తమ లగ్జరీ ఫ్లాట్లు అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడు తున్నాయి. ఆర్థిక మాంద్యం రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని, మూడో వంతు కొనుగోళ్లు తగ్గిపోయా యని ప్రముఖ రియల్ సంస్థ అధ్యయ నంలో తేలింది. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని ప్రముఖ నిర్మాణ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఒకరు చెప్పారు.
ఎందుకీ పరిస్థితి?
ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు రియల్ ఎస్టేట్ సీజన్ కొంత మేర తగ్గినా ఈ స్థాయిలో తగ్గుదలకు ఆర్థిక మాంద్యమే కారణమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు, అప్పులు ఇచ్చే వాళ్లు తగ్గిపోవడంతో పాటు ఒకే ఏడాదిలో భారీగా స్థలాల రేట్లు పెరిగి పోయాయని.. సంవత్సరానికి ఒకటి, రెండు రెట్లు పెరగాల్సి ఉండగా, ఏకంగా నాలుగైదు రేట్లు పెరిగిపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని వివరిస్తున్నారు. ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్‌ఆర్)లో ఔటర్ రింగ్‌రోడ్డు ఆవల గజ్వేల్, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపూర్, మర్రిగూడ, చింతపల్లి, మాల్, షాద్‌నగర్, చేవెళ్ల, కంది ప్రాంతాల్లో కొనుగోళ్లు, అమ్మకాలు పెద్ద స్థాయిలోనే జరిగాయి. కొందరు బడా కాంట్రాక్టర్లు కూడా ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌ను ఎంచుకోవడంతో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగాయి. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ప్రతిపాదన పక్కకు జరిగిందన్న ప్రచారంతో ఈ ప్రాంతాల పరిధిలో స్థలాల కొనుగోలుకు, వెంచర్లు చేసేందుకు ఏవరూ ధైర్యం చేయడంలేదు.
తగ్గిన రిజిస్ట్రేషన్లు..
ఆర్థిక మాంద్యం కారణంగా రియల్ కార్యకలాపాలు తగ్గిపోయాయనే విషయం రిజిస్ట్రేషన్ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత నాలుగైదు నెలల రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో గతేడాది ఏప్రిల్‌లో 2,135 లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,816కి తగ్గిపోయింది. సెప్టెంబర్ విషయానికి వస్తే 2018లో 1,859 లావాదేవీలు జరగ్గా ఇప్పుడు 1,296కు పడిపోయింది. ఇక రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌లో 33,013 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 31,831 మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్‌లో అక్కడ రిజిస్ట్రేషన్ల సంఖ్య 27,492కు పడిపోయింది. అవి కూడా కొత్త కొనుగోళ్లకు సంబంధించినవి కావని, గతంలో జరిగిన ఒప్పందాల మేరకు జరిగిన రిజిస్ట్రేషన్లతో పాటు లీజ్ డాక్యుమెంట్లు ఎక్కువగా వస్తున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
హైదరాబాద్, బెంగళూరుపైనే అధిక ప్రభావం..
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై ఇటీవల అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో హైదరాబాద్‌లో అమ్మకాలు ఘోరంగా తగ్గిపోయిన విషయం వెల్లడైంది. మన రాజధానిలో ఏకంగా 32–35 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని తేలింది. ఆ మూడు నెలల్లో (జూలై– సెప్టెంబర్) కేవలం 3వేల యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని, గతేడాది ఇదే సమయానికి 10 వేలకు పైగా అమ్మకాలు జరిగాయని ఈ సంస్థ పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయని.. అందులో హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఎక్కువ ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురయ్యాయని వివరించింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ రెండు నగరాల్లో ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు పడిపోవడం పట్ల బడా నిర్మాణ సంస్థలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి, దేశంలో ఆర్థిక మాంద్యం ప్రారంభమైన నాటి నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 9 శాతం అమ్మకాలు పడిపోగా, రెండో త్రైమాసికంలో అది సగటున 18 శాతానికి తగ్గింది. ఈ రెండు త్రైమాసికాలే కాకుండా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, అప్పటి వరకు ఆర్థిక మాంద్యం ప్రభావం ఉంటుందని మరో ప్రముఖ ఆర్థిక సంస్థ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది.
కొనేవారు కరువు
‘ఆరు నెలల క్రితం వరకు నెలకు కనీసం నాలుగు ప్లాట్లు అమ్మించేవాడిని. ఆర్ధిక మాంద్యం ప్రభావం వల్ల భూములు అమ్మేవారు ఉన్నా.. కొనేవారు ముందుకు రాకపోవడంతో ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోవడం లేదు. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువ మంది బ్యాంకుల్లో డబ్బులు నిల్వ ఉంచడం కంటే భూములపై పెట్టుబడులు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అసాధారణ ధరలకు స్థలాలు, భూములు కొనుగోలు చేశారు. దీంతో ప్రజల దగ్గర ఉన్న డబ్బులో అధిక శాతం ఖర్చయిపోయింది. ప్రస్తుతం ఎక్కడో ఒకచోట అమ్మితేనే మరోచోట కొనడానికి అవకాశం ఉంది. కానీ కొనేవారే దొరకడం లేదు. గతంలో పలికిన రేటు తగ్గించి చెప్పినా కొనడానికి ముందుకు వచ్చేవారు లేరు.’ – సామ భీంరెడ్డి, రియల్ ఎస్టేట్ ఏజెంట్
జనవరి వరకు ఇలాగే ఉండొచ్చు
‘రియల్ ఎస్టేట్ రంగంలో కొంత స్తబ్దత ఉంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. యూరోప్, అమెరికా తదితర దేశాల్లో ఇప్పుడు అంతా హాలిడే మూడ్ ఉంటుంది. పెట్టుబడులు మన దేశానికి పెద్దగా రావు. దీంతోపాటు ఆర్థిక మాంద్యం కారణంగా మార్కెట్‌లో ‘క్యాష్ క్రంచ్’ ఏర్పడింది. మూడు నెలల క్రితం వరకు మార్కెట్ బాగానే ఉన్నా ప్రస్తుతం ప్లాట్ల అమ్మకాలు 50శాతం పడిపోయాయి. అగ్రిమెంట్లు జరిగినా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితి జనవరి వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది.’ – లక్ష్మీనారాయణ, సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment