నేలచూపులు ఇదే రియల్‌ | Real Estate Sales Demand Decreased Over Recession In Hyderabad | Sakshi
Sakshi News home page

నేలచూపులు ఇదే రియల్‌

Published Fri, Oct 11 2019 3:49 AM | Last Updated on Fri, Oct 11 2019 4:00 AM

Real Estate Sales Demand Decreased Over Recession In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థిరాస్తి రంగంలో స్తబ్ధత నెలకొంది. ఆర్థిక మాంద్యం.. నింగినంటిన ధరలతో రియల్టీ నేల చూపులు చూస్తోంది. అక్కడక్కడా లావాదేవీలు జరుగుతున్నా.. గతంలో చేసుకున్న ఒప్పందాలే తప్ప.. కొత్త కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. అసాధారణంగా పెరిగిన ధరలు కూడా కొనుగోలుదారులు వెనక్కి తగ్గేలా చేశాయి. మరోవైపు ప్రతిపాదిత రీజనల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)పై నీలినీడలు కమ్ముకున్నట్లు వార్తలు రావడంతో రియల్‌రంగం పతనానికి కారణమైంది.ఈ రహదారి నిర్మాణంతో మహర్దశ పడుతుందని ఆశించిన సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ప్లాట్లు, వ్యవసాయ భూములపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు.

దీంతో మహబూబ్‌నగర్, ఆలంపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, జహీరాబాద్, తాండూరు తదితర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ ఖరారు కాకముందే బ్రోకర్ల మాయాజాలంతో ధరలు ఆకాశన్నంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున ప్రతిపాదిత రహదారి అటకెక్కినట్లేనన్న ప్రచారం.. రియల్‌ మార్కెట్‌æ భారీ కుదుపునకు గురిచేసింది. దీంతో అప్పటివరకు దూకుడు మీద ఉన్న వ్యాపారం చతికిలపడింది. అగ్రిమెంట్లు చేసుకొని అమ్ముకుందామనే దశలో కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు.

ఆర్థిక మాంద్యంతో కుదేలు! 
ఆర్థిక మాంద్యం స్థిరాస్తి రంగాన్ని కుదేలు చేస్తోంది. ప్రచార, ప్రసారమాధ్యమాల్లో ఈ మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉండనుందనే ప్రచారం కూడా దీనికి తోడు కావడంతో ఇళ్ల స్థలాలు, భూముల కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. అటు నిర్మాణ రంగంలోనూ ఈ ప్రభావం కన్పిస్తోంది. నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో విల్లాలు, ఫ్లాట్‌ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు లేకపోవడంతో గృహాల అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఈ తరుణంలో విల్లాలు, ఫ్లాట్‌ల నిర్వహణ వ్యయం భారీగా ఉండటంతో పాటు ఆర్థిక స్థోమతను దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారులు స్థలాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో విలాసవంతమైన గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్‌ల అమ్మకాల్లో క్షీణత కనిపిస్తోంది.

ఎడాపెడా పెట్టుబడులు! 
స్థిరాస్తిరంగం కాసులు కురిపిస్తుండటంతో బడాబాబులు, సంపన్నవర్గాల పెట్టుబడులకు ఇది కేంద్రబిందువుగా మారింది. దీనికి తోడు కేంద్రం బ్యాంకు లావాదేవీలపై నియంత్రణ విధించడంతో నల్లధనం కూడా వెల్లువలా వచ్చింది. దీంతో భూముల విలువ అమాంతం చుక్కలను తాకాయి. తాజాగా నెలకొన్న పరిస్థితులతో పెట్టుబడులపై సంపన్న వర్గాలు కూడా ఆచీతూచీ అడుగేస్తుండటం కూడా రియల్‌ రంగం ఒడిదుడుకులకు కారణంగా చెబుతున్నారు.

20%  అధిక ఆదాయం..
ఆషాఢమాసంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గతేడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా రూ.2,250 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇళ్ల కొనుగోలుపై దృష్టి చూపని వారంతా స్థలాలు, వ్యవసాయ భూముల కొనుగోలు వైపు మళ్లుతున్నట్లు అర్థమవుతోంది. కాగా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నం(సబ్‌రిజిస్ట్రార్‌)లో గత మూడు నెలలుగా భూముల క్రయవిక్రయాలు తగ్గుముఖం పట్టినట్లు నమోదైన రిజిస్ట్రేషన్ల సంఖ్యను బట్టి తెలుస్తోంది. టీసీఎస్, లాజిస్టిక్‌ పార్క్, ఫార్మాసిటీ, బీడీఎల్, ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్, కొత్త కలెక్టరేట్‌తో ఇక్కడ కొన్నాళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. ఆర్థిక మాంద్యం, అమాంతం పెరిగిన ధరలు ఈ ప్రాంతంలోనూ తీవ్ర ప్రభావం చూపినట్లు రిజిస్ట్రేషన్లను బట్టి తెలుస్తోంది. మూడు నెలల్లో ఏకంగా వేయి డాక్యుమెంట్లు తగ్గిపోగా.. రూ.60 లక్షల ఆదాయంలోను తేడా వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement