'హైదరాబాద్ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే'
వరంగల్ టౌన్: శాంతిభద్రతలకు సంబంధించి హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగమని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలను తెలంగాణ ప్రభుత్వమే చూస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్ల రూపాయల వ్యవహారంపై ఏసీబీ విచారణ జరుపుతోందని తెలిపారు. ఈ విషయంలో అంతా చట్టప్రకారమే జరుగుతోందని చెప్పారు. సోమవారం వరంగల్ వచ్చిన ఆయన పోలీస్‌హెడ్‌క్వార్టర్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నామని... వీటిలో ఒకదాన్ని వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలీస్ శాఖలో 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బెటాలియన్‌లకు మరో మూడు వేల పోస్టులు అవసరమవుతాయని పేర్కొన్నారు.
మొత్తంగా పోలీస్ శాఖలో త్వరలోనే 18 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. పోస్టులు భర్తీ చేసిన తర్వాత పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చే వెసులుబాటు ఉంటుందని పేర్నొన్నారు. పోలీస్ శాఖ పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే జిల్లా స్థాయి అధికారులకు, తమకు ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించకుండా ఇబ్బంది పెట్టే సిబ్బందిని ఉపేక్షించేది లేదని అన్నారు. వరంగల్ కమిషనరేట్‌కు అవసరమైన భవనం నిర్మాణం కోసం రూ.5.5 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. 12 ఇన్నోవా పెట్రోలింగ్ వాహనాలు, ఏడు స్కార్పియో ఇటర్సేప్టర్ వాహనాలను ఈ సందర్భంగా డీజీపీ పూజలు చేసి, జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్‌ఎస్పీ బెటాలియన్, వరంగల్ రూరల్ పోలీస్ జిల్లా కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూముల ఎంపిక కోసం డీజీపీ అనురాగ్‌శర్మ... మామునూరు, చింతగట్టు(హసన్‌పర్తి), ములుగు ఘణపురంలో పర్యటించారు.