సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర వాసులకు ముందస్తు సూచన. రేపటి నుంచి వారం రోజుల పాటు నగరం ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారే అవకాశముంది. మామూలుగానే హైదరాబాద్‌లో ట్రాఫిక్ స్తంభన నిత్యకృత్యం. ఇక ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు, అనుకోని ఘటనలు జరిగినప్పుడు వాహనదారులకు చుక్కలు కనిపిస్తుంటాయి. వీటికి తోడు మెట్రో రైలు పనులు జరుగుతుండటంతో చోదకులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. వరుస పెళ్లిళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలతో గురువారం నుంచి నగరం సందడిగా మారనుంది. నగర రహదారులపై వాహనాల రాకపోకలు పెరిగే అవకాశముందని, దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహం..
ఈ నెల 23 నుంచి 26 వరకు భారీగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రోడ్లపై రేపటి నుంచి ట్రాఫిక్ పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈనెల 26న గచ్చిబౌలి మైదానంలో స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ఉంది. కాబట్టి అటువైపు వెళ్లే వాహనదారులకు కష్టాలు తప్పవు. ఈ మార్గంలో వెళ్లేవారు ప్రత్యామ్నాయం చూసుకుంటే మంచిదని ట్రాఫిక్ అధికారులు సూచించారు.
28న యమ బిజీ..
భాగ్యనగరానికి తలమానికంగా పేర్కొంటున్న ప్రతిష్టాత్మక మెట్రో రైలును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న హైదరాబాద్ రానున్నారు. అదేరోజు సాయంత్రం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) ప్రారంభం కానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా సహా దేశవిదేశాల నుంచి 1,500 ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రముఖుల రాకతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ నిలిపివేయడం లేదా మళ్లిస్తారు. దీంతో హైదరాబాదీలకు ట్రాఫిక్ ఇక్కట్లు రెట్టింపుకానున్నాయి. అత్యవసరమైతే తప్పా రోడ్లపైకి రావొద్దని నగర వాసులకు అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment